
Bangladesh: బంగ్లాదేశ్'లో తిరుగుబాటు.. మీడియాలో వదంతులు: ముహమ్మద్ యూనస్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటు జరుగబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు మంగళవారం నివేదించాయి.
అయితే, బంగ్లాదేశ్ సైన్యం ఈ వార్తలను తిప్పికొట్టింది.తాజాగా, యూనస్ కూడా దీనిపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు.
తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కథనాలు ప్రచారమవుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఇలాంటి వదంతులు మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ టెలివిజన్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన యూనస్, మీడియా వదంతులపై తీవ్ర విమర్శలు చేశారు.
వివరాలు
మన ఐక్యత వారిని భయాందోళనకు గురిచేస్తోంది: యూనస్
"గతేడాది జులై-ఆగస్టు నెలల్లో తిరుగుబాటు ప్రయత్నాలు విఫలమైన తర్వాత, కొందరు వ్యక్తులు వాటిని తమ లాభానికి ఉపయోగించుకోవడానికి ఈ వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. ఈ తప్పుడు కథనాల వెనుక ఎవరు ఉన్నారో, వాటిని నడిపించేవారు ఎవరో మీ అందరికీ తెలుసు. భారీగా నిధులను వినియోగిస్తూ, 24 గంటలూ ఇదే పని చేస్తున్నారు. అయితే, మన ఐక్యత వారిని భయాందోళనకు గురిచేస్తోంది. అందుకే మన సమగ్రతను ధ్వంసం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటువంటి వార్తలు మరింతగా పెరుగుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అని యూనస్ అన్నారు.
వివరాలు
అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంటోనియో గుటెర్రెస్ మద్దతు
ఈ అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఐక్యరాజ్య సమితి సహాయాన్ని కోరినట్లు యూనస్ వెల్లడించారు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్, ఈ విషయమై తన మద్దతును ప్రకటించినట్లు తెలిపారు.
గతేడాది ఆగస్టులో రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనలు తీవ్రంగా హింసాత్మకంగా మారిన నేపథ్యంలో, అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది.
వివరాలు
బంగ్లాదేశ్ సైన్యం అత్యవసర సమావేశం
తాజాగా, యూనస్ ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగే అవకాశం ఉందన్న వార్తలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ సైన్యం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అయితే, బంగ్లా ఆర్మీ ఈ వార్తలను ఖండించింది. అసత్య కథనాలను ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, ఇది విలేకరుల తప్పుడు ప్రవర్తనను ప్రతిబింబిస్తుందని బంగ్లాదేశ్ సైనిక ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ అధికారిక ప్రకటనలో పేర్కొంది.