LOADING...
Elon Musk: అంతరిక్షంలో డేటా సెంటర్లు.. కక్ష్యలోకి 10 లక్షల ఉపగ్రహాలు: మస్క్ సంచలన ప్రణాళికలు
మస్క్ సంచలన ప్రణాళికలు

Elon Musk: అంతరిక్షంలో డేటా సెంటర్లు.. కక్ష్యలోకి 10 లక్షల ఉపగ్రహాలు: మస్క్ సంచలన ప్రణాళికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా-స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలను తెరపైకి తీసుకొచ్చారు. అంతరిక్షాన్ని కేంద్రంగా చేసుకుని భవిష్యత్తు సాంకేతిక అవసరాలను తీర్చే దిశగా ఆయన కీలక ఆలోచనలు వెల్లడించారు. అంతరిక్షంలోనే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే భూమి కక్ష్యలోకి 10 లక్షల ఉపగ్రహాలను పంపడమే తన దీర్ఘకాలిక లక్ష్యమని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఈ భారీ ప్రణాళికలకు అవసరమైన ఆర్థిక బలాన్ని సమకూర్చుకునేందుకు ఇటీవల స్పేస్‌ఎక్స్‌లో తన ఏఐ వ్యాపారాన్ని విలీనం చేశారు.

వివరాలు 

త్వరలోనే ఐపీఓకు కొత్త సంస్థ 

ఈ రెండు విభాగాలు కలసి ఏర్పడిన కొత్త సంస్థను త్వరలోనే ఐపీఓకు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ వ్యవస్థలు భారీగా విద్యుత్‌, కూలింగ్ సదుపాయాలపై ఆధారపడుతున్నాయని మస్క్ తెలిపారు. భూమిపై ఉన్న పెద్ద సంఖ్యలో డేటా సెంటర్ల ద్వారానే ఇవి పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే భవిష్యత్తులో ఏఐ వినియోగం మరింత విస్తరించినప్పుడు ప్రస్తుత డేటా సెంటర్లు సరిపోవని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో ఈ సమస్యకు అంతరిక్ష ఆధారిత ఏఐ వ్యవస్థలే సరైన పరిష్కారమని మస్క్ వివరించారు.

వివరాలు 

భూమి కక్ష్యలోకి 10 లక్షల ఉపగ్రహాలు.. 

అందుకే అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వాటికి అవసరమైన విద్యుత్‌ను సౌరశక్తి ద్వారా అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు, అంతరిక్షంలో ఏర్పాటు చేసే డేటా సెంటర్లు సమర్థంగా పనిచేయాలంటే భారీ సంఖ్యలో శాటిలైట్లు అవసరమవుతాయని, అందుకే భూమి కక్ష్యలోకి 10 లక్షల ఉపగ్రహాలను పంపించనున్నట్లు వెల్లడించారు. అయితే మస్క్ ప్రకటించిన ఈ ప్రణాళికలు సాంకేతికంగా, ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌బాట్లు, ఇతర ఏఐ టూల్స్ నిర్వహణ కోసం అంతరిక్షంలో సౌరశక్తిని వినియోగించడం వల్ల భూమిపై ఉన్న పవర్‌గ్రిడ్‌లపై ఒత్తిడి తగ్గొచ్చని వారు అంగీకరిస్తున్నారు. కానీ దీనితో పాటు కొన్ని సమస్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

వివరాలు 

కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల్లో ఏదైనా విఫలమైతే..

డేటా సెంటర్లు పెద్ద మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తాయని, భూమితో పోలిస్తే అంతరిక్షంలో కంప్యూటర్ చిప్‌లు మరింత వేగంగా ఓవర్‌హీట్ అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే ఉపగ్రహాల సంఖ్య భారీగా పెరిగితే మరో కీలక సమస్య తలెత్తవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల్లో ఏదైనా విఫలమైతే, అది ఇతర శాటిలైట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం స్టార్‌లింక్‌కు చెందిన దాదాపు 10 వేల ఉపగ్రహాలు ఇప్పటికే భూమి కక్ష్యలో సంచరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మరింతగా 10 లక్షల ఉపగ్రహాలను ప్రయోగిస్తే ప్రమాదాల అవకాశాలు గణనీయంగా పెరిగే వీలుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Advertisement