మయన్మార్‌లో విరుచుకుపడ్డ శతఘ్ని.. 29 మంది శరణార్థుల దుర్మరణం
మయన్మార్‌లో ఘోరం చోటు చేసుకుంది. తలదాచుకున్న ఓ శరణార్థి శిబిరంపై శతఘ్ని దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి వెనుక సైన్యం పాత్రపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన సైన్యం, దాడి తాము జరపలేదని తేల్చి చెప్పింది. లైజాలో సోమవారం అర్ధరాత్రి నిరాశ్రయుల క్యాంప్‌పై శతఘ్ని విరుచుకుపడింది. ఘటనలో 29 మంది మరణించగా సుమారు 44 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలం కచిన్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్ అనే ఓ వేర్పాటువాద ఆధీనంలో ఉంది. 2021లో మయన్మార్ పౌర ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం, రాజ్యాధికారం దక్కించుకుంది.
కచిన్ వేర్పాటువాద సంస్థకు 2 కిమీ దూరంలోనే ఘటన
ఆనాటి నుంచి ప్రత్యర్థులను అణిచివేసేందుకు, ఆర్మీ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. తాజా దాడి వెనుక తమ పాత్రేమీ లేదని సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఝా మిన్ తున్ చెప్పుకొచ్చారు. వేర్పాటువాదుల మందుగుండు నిల్వలు పేలడంతోనే ఈ దారుణం జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే కచిన్ వేర్పాటువాద సంస్థ ప్రధాన కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఘటనా స్థలం ఉండటం కొసమెరుపు. కొన్నాళ్లుగా కచిన్ వేర్పాటువాదులు, మయన్మార్ సైనిక ప్రభుత్వంతో పోరాటాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. ఘటనపై దేశంలోని ఐరాస కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.