Israel - Iran: డమాస్కస్‌పై వైమానిక దాడిలో నస్రల్లా అల్లుడు మృతి
గత వారం బీరుట్‌లో జరిగిన దాడుల్లో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో ఆయన కుమార్తె కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, నస్రల్లా అల్లుడు కూడా మరణించినట్లు తెలుస్తోంది. సిరియాలోని డమాస్కస్ లోని మజ్జే ప్రాంతంలోని నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు లెబనాన్ పౌరులు మరణించారు. ఈ ఇద్దరి కిందట హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ కూడా ఉన్నట్లు సిరియన్ మానవ హక్కుల అబ్జర్వేటరీ పేర్కొంది. హెజ్‌బొల్లాకు చెందిన మీడియా కూడా ఈ వార్తను ధ్రువీకరించింది.
అమెరికా పౌరుడు మృతి
మరోవైపు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఒక అమెరికా పౌరుడు కూడా మరణించినట్లు అమెరికా ప్రకటించింది. మిచిగాన్‌లోని డియర్‌బోర్న్‌కు చెందిన కమెల్ అహ్మద్ జావెద్ అనే అమెరికా పౌరుడు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై వాషింగ్టన్ స్పందిస్తూ, అహ్మద్ మృతి తమను తీవ్రంగా బాధించింది అని వైట్‌హౌస్ పేర్కొంది. బాధితుడి కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు సాయం చేయడానికి వెళ్లిన సమయంలో క్షిపణి దాడిలో నా తండ్రి మరణించారని అహ్మద్ జావెద్ కుమార్తె తెలిపింది.