Neel Acharya: అమెరికాలో హత్యకు గురైన మరో భారతీయ విద్యార్థి!
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతికి సంబంధించిన అంశం సంచలనంగా మారింది. అట్లాంటాలోని ఓ దుకాణంలో భారతీయ విద్యార్థి వివేక్ సైనీని ఓ డ్రగ్స్ బానిస సుత్తితో కొట్టి చంపిన ఒకరోజు తర్వాత.. ఇప్పుడు చికాగోలోని పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థిని హత్య కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ఆదివారం యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అదృశ్యమైన భారత విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. వెస్ట్ లఫాయెట్‌లోని 500 ఎల్లిసన్ రోడ్‌లో మృతదేహం లభ్యమైనట్లు ఆదివారం ఉదయం 11:30 గంటలకు తమకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అయితే నీల్ ఆచార్యను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తల్లి విజ్ఞప్తి చేసిన ఒకరోజు తర్వాత మృతదేహాం లభ్యం
తన కొడుకు ఆచూకీ కనుక్కోవాలని ఆదివారం నీల్ తల్లి గౌరీ ఆచార్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విజ్ఞప్తి చేశారు. తమ అబ్బాయి జనవరి 28 నుంచి కనిపించడం లేదని, అతను USAలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదవుతున్నట్లు పేర్కొన్నారు. తమ కుమారుడికి సంబంధించిన సమాచారం కావాలని, ఎవరైనా తెలిస్తే చెప్పాలని ఆమె సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమయ్యారు. పర్డ్యూ విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. అనంతరం నీల్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ కూడా నీల్ ఆచార్య మరణాన్ని ధృవీకరించారు.