Neet vs Gaokao: నీట్ వివాదం మధ్య చైనా ఎంట్రీ.. గావ్‌కావో పరీక్షను ప్రపంచం ఎందుకు గౌరవిస్తుంది?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో నీట్ (NEET) పరీక్ష వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, చైనా భారత పరీక్షా వ్యవస్థపై పరోక్షంగా సెటైర్లు వేసింది. చైనాలో ఇటీవల నిర్వహించిన జాతీయ ప్రవేశ పరీక్ష 'గావ్‌కావో (Gaokao)'ను ప్రస్తావిస్తూ, భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రపంచంలోనే అతిపెద్ద పరీక్ష అయిన గావ్‌కావో,భారత్‌లోని జేఈఈ (JEE),నీట్ (NEET) పరీక్షలకు సమానమైనది. 1.3 కోట్ల మంది విద్యార్థులకు కేవలం రెండు రోజుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాం. విద్యార్థుల కోసం ఫ్యాక్టరీలు కూడా ఆగిపోయాయి.రహదారులు నిశ్శబ్దంగా మారాయి. దేశమంతా విద్యార్థులకు అండగా నిలిచింది" అంటూ ఆమె ఎక్స్ (X) వేదికలో పోస్టు చేశారు.
వివరాలు
నీట్‌లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు
భారత్‌లో నీట్-యూజీ 2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ (NTA) పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నీట్‌లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యూ జింగ్ చేసిన ట్వీట్
China's Gaokao — the world's largest exam & India's equivalent of JEE/NEET rolled into one — was conducted smoothly for 1.3 crore students in just 2 days 🎓
— Yu Jing (@ChinaSpox_India) June 10, 2026
Factories paused. Roads quieted. The entire nation rallied for its students.
चीन की गाओकाओ — दुनिया की सबसे बड़ी परीक्षा,… pic.twitter.com/aSbpL05suN
వివరాలు
గావ్‌కావో అంటే ఏమిటి?
ప్రతి ఏడాది చైనాలో నిర్వహించే జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షే గావ్‌కావో. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. హైస్కూల్ పూర్తి చేసిన విద్యార్థులు చైనీస్, గణితం, ఇంగ్లిష్‌తో పాటు సైన్స్ లేదా హ్యూమానిటీస్ విభాగాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సాధారణంగా జూన్ నెలలో ఈ పరీక్షలు రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు జరుగుతాయి. ఈ ఏడాది దాదాపు 1.29 కోట్ల మంది విద్యార్థులు గావ్‌కావో కోసం నమోదు చేసుకున్నట్లు చైనా విద్యాశాఖ వెల్లడించింది.
వివరాలు
పరీక్షల సమయంలో దేశమే విద్యార్థుల కోసం..
గావ్‌కావో పరీక్షల రోజుల్లో చైనాలో ప్రత్యేక వాతావరణం కనిపిస్తుంది. పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకుని పిల్లలకు ప్రోత్సాహం అందిస్తారు. విజయం సాధించాలని సూచించే ప్రత్యేక సంప్రదాయ దుస్తులు ధరించడం, సూర్యకాంతి పువ్వులు చేతబట్టుకుని శుభాకాంక్షలు చెప్పడం అక్కడ ఆనవాయితీ.
వివరాలు
ప్రశ్నాపత్రాల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
గావ్‌కావో ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా చైనా అత్యంత కఠినమైన భద్రతా చర్యలు చేపడుతుంది. ప్రశ్నాపత్రాలు రూపొందించే ఉపాధ్యాయులను దాదాపు నెల రోజుల పాటు ప్రత్యేక భద్రతా కేంద్రాల్లో ఉంచుతారని సమాచారం. ప్రశ్నాపత్రాల ముద్రణ కూడా హైసెక్యూరిటీ ప్రింటింగ్ కేంద్రాల్లో జరుగుతుంది. అనంతరం ఆయుధాలతో కూడిన భద్రతా బలగాల మధ్య ప్రత్యేక వాహనాల్లో శాటిలైట్ ట్రాకింగ్, ప్రత్యక్ష పర్యవేక్షణతో పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ ఇనుప తలుపులు, భద్రతా గదులు, లాకర్లలో ప్రశ్నాపత్రాలను భద్రపరుస్తారు. వాటిని తెరవాలంటే మూడు వేర్వేరు వ్యక్తుల వద్ద ఉండే తాళాలతో మూడు దశల్లో అనుమతి అవసరం. ఈసారి పరీక్షా కేంద్రాల్లో స్మార్ట్ వాచ్‌లు,స్మార్ట్ గ్లాసెస్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధించారు. మొత్తం కేంద్రాలు వీడియో నిఘాలోనే కొనసాగాయి.
వివరాలు
గావ్‌కావో చరిత్ర ఏంటి?
గావ్‌కావో మూలాలు ప్రాచీన చైనా సామ్రాజ్య కాలం వరకు వెళ్తాయి. సూయి రాజవంశం (581-618) కాలంలో ప్రారంభమైన 'కేజు' అనే రాజ్య ఉద్యోగాల ఎంపిక పరీక్షా విధానమే దీనికి పూర్వ రూపంగా భావిస్తారు. కుటుంబ నేపథ్యం కాకుండా ప్రతిభ ఆధారంగా అధికారులను ఎంపిక చేయడం అప్పటి ప్రత్యేకత. 1905లో ఈ వ్యవస్థ రద్దయిన తర్వాత ఆధునిక విద్యా విధానం అభివృద్ధి చెందింది. 1949లో చైనా ప్రజాస్వామ్య గణరాజ్యం ఏర్పడే సమయానికి దేశంలో నిరక్షరాస్యత అధికంగా ఉండటంతో విద్యా ప్రమాణాలను పెంచేందుకు 1952లో గావ్‌కావోను ప్రవేశపెట్టారు. సాంస్కృతిక విప్లవం సమయంలో ఈ పరీక్షలు నిలిపివేసినా, 1977లో తిరిగి ప్రారంభించారు. అప్పటి నుంచి చైనా విద్యా వ్యవస్థలో గావ్‌కావో కీలక స్థానాన్ని సంపాదించింది.
వివరాలు
విమర్శలూ ఉన్నాయి..
గావ్‌కావోలో విజయం సాధించలేకపోతే జీవితాంతం తక్కువ స్థాయి ఉద్యోగాలకే పరిమితం కావాల్సి వస్తుందనే భావన చైనాలో బలంగా ఉంది. దీంతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరీక్షల కోసం వారానికి సగటున 60 గంటల పాటు విద్యార్థులు చదువుతారని నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది విద్యార్థులు ఇతర తరగతులను కూడా వదిలేసి ప్రత్యేకంగా గావ్‌కావో కోచింగ్ తీసుకుంటారు. ఈ ఒత్తిడి కారణంగా ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. అత్యధిక మార్కుల కోసం కొందరు ఐవీ డ్రిప్స్ ఉపయోగించడం, బాలికలు పరీక్షల వరకు రుతుక్రమాన్ని వాయిదా వేసేందుకు మందులు తీసుకోవడం, రాత్రింబవళ్లు నిద్ర లేకుండా చదవడం వంటి సంఘటనలు కూడా వెలుగుచూశాయి.
వివరాలు
ఉద్యోగాలపై ఆందోళన
అంతేకాదు, కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ 2022లో గావ్‌కావో పరీక్షల సమయంలో కూడా ప్రశ్నాపత్రాల లీక్, కాపీయింగ్ ఆరోపణలు వినిపించాయి. చైనాలో యువత నిరుద్యోగం పెరుగుతున్న సమయంలో గావ్‌కావో పరీక్షలు నిర్వహించడం మరో సవాల్‌గా మారింది. అధికారిక గణాంకాల ప్రకారం, 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులు కాని యువతలో దాదాపు ఆరుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా చివరకు సరైన ఉద్యోగాలు దొరుకుతాయా అనే ప్రశ్న చైనా యువతను వెంటాడుతోంది.