నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం
నేపాల్ విమాన ప్రమాదం నేపథ్యంలో మృతదేహాల కోసం అన్వేషిస్తున్న క్రమంలో రెండు బ్లాక్ బాక్స్‌లను సిబ్బంది గుర్తించారు. వాటిని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. బ్లాక్ బాక్స్‌లోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ప్రమాదానికి గల కారణాలను గుర్తించడంలో ఉపయోగపడుతాయి. 68మంది సిబ్బంది, నలుగురు సిబ్బందితో నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా అందులోని అందరూ చనిపోయినట్లు నేపాల్ పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది. ఇప్పటివరకు 68 మృతదేహాలను సిబ్బంది సహాయక సిబ్బంది గుర్తించారు.
నాలుగు మృతదేహాల కోసం రెస్క్యూ సిబ్బంది అన్వేషణ
మిగిలిన నాలుగు మృతదేహాల కోసం రెస్క్యూ సిబ్బంది అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో నే రెండు బ్లాక్ బాక్సులు లభ్యమయ్యాయి. అలాగే విమానంలోని 15మంది విదేశీ ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు దక్షిణ కొరియన్లు, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. సాధారణంగా విమానంలో రెండు బ్లాక్ బాక్సులు ఉంటాయి. అందులో రికార్టర్లను అమర్చుతారు. ఒక బాక్స్ ముందు భాగంలో ఉంటుంది. రెండోది వెనక భాగంలో ఉంటుంది. విమానంలో మాటలతో సహా, ప్రతి శబ్దాలన్ని ఈ బాక్సులు రికార్డు చేస్తాయి. విమానం ప్రమాదం జరిగినప్పుడు.. ఏమైందో తెలుసుకోవడానికి ఈ బాక్సులు ఎంతగానో ఉపయోగపడుతాయి.