Nepal: నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. హోంమంత్రి సుదన్ గురుంగ్ రాజీనామా..
ఈ వార్తాకథనం ఏంటి
అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా పూర్తికాకముందే నేపాల్‌లో బాలెన్ షా ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశ హోంమంత్రి సుదన్ గురుంగ్ తన పదవికి రాజీనామా చేయడం దేశీయంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత మధ్య ఆయన బుధవారం తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి బాలెన్ షాకు సమర్పించారు. రాజీనామాకు దారితీసిన కారణాలు.. హోంమంత్రి సుదన్ గురుంగ్‌పై గత కొంతకాలంగా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అక్రమ ధన లావాదేవీల కేసులు, దర్యాప్తు ఎదుర్కొంటున్న వివాదాస్పద వ్యాపారవేత్త దీపక్ భట్టాకు చెందిన సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి.
వివరాలు
రోడ్లపైకి వస్తున్న ప్రజలు..
ఈ పరిస్థితుల్లో నిష్పాక్షిక విచారణకు సహకరించేందుకు నైతిక బాధ్యతతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురుంగ్ సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. ప్రధాని బాలెన్ షా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కూడా గడవకముందే దేశవ్యాప్తంగా నిరసనలు ముదురుతున్నాయి. కాట్మండు సహా ప్రధాన నగరాల్లో విద్యార్థులు, రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలపై భారం పెరుగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత్‌తో ముడిపడి ఉన్న సరిహద్దు నిబంధనలు ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్నాయి.
వివరాలు
రోడ్లపైకి వస్తున్న ప్రజలు..
భారత్ నుంచి వచ్చే వంద రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులపై నేపాల్ ప్రభుత్వం సుంకాలు విధించడం వివాదాస్పదంగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోజువారీ అవసరాల కోసం భారత్‌పై ఆధారపడుతుంటారు. ఈ కొత్త నిబంధనల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బాలెన్ షాకు, తన కేబినెట్‌లోనే మంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడం పెద్ద దెబ్బగా మారింది. మరోవైపు సొంత పార్టీలో అసమ్మతి, ప్రజల నిరసనలు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ సంక్షోభ పరిస్థితులను బాలెన్ షా ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.