Trump-Netanyahu: ట్రంప్‌కు నెతన్యాహు రోజూ ఫోన్.. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయాలంటూ ఒత్తిడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు ప్రారంభించాలని ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా నెతన్యాహు ప్రతిరోజూ ట్రంప్‌కు ఫోన్ చేసి, ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ సహా పలు దేశాలు అమెరికాకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ దేశాల నేతలు కూడా ట్రంప్‌పై ఒత్తిడి తెస్తుండటంతో పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వివరాలు
ట్రంప్ వైఖరిలో మార్పు?
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం, ఇరాన్‌పై యుద్ధానికి అమెరికాలో వ్యతిరేకత పెరుగుతుండటం వంటి పరిణామాలు ట్రంప్ వైఖరిలో మార్పునకు కారణమైనట్లు కనిపిస్తున్నాయి.
యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా మాత్రం పరిమిత స్థాయిలో సైనిక దాడులను కొనసాగిస్తోంది.
నవంబర్ 3, 6 తేదీల్లో ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడులు చేసినట్లు సమాచారం.
నవంబర్ 6న జరిగిన దాడి గురించి ట్రంప్ నేరుగా వివరించకపోయినా.. అమెరికా మరోసారి దాడి చేసిన విషయాన్ని మాత్రం ధ్రువీకరించారు.
వివరాలు
15 నిమిషాల్లోనే ధ్వంసం చేశాం: ట్రంప్
ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న దాడుల గురించి వివరించారు.
''మేము చిన్నచిన్న దాడులు చేస్తున్నాం. అయితే అవి నిర్దేశించిన లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి. ఇరాన్ ఒక చిన్న వైమానిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాన్ని మేము 15 నిమిషాల్లో.. బహుశా ఐదు నిమిషాల్లోనే ధ్వంసం చేశాం. ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగిస్తున్నాం'' అని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
దాడులకు నెతన్యాహు ఒత్తిడి
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఇరాన్‌పై దాడులు చేపట్టాలని ట్రంప్‌ను నెతన్యాహు కోరినట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇజ్రాయెల్ ప్రధాని ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. సైనిక చర్య విషయంలో తొందరపడకూడదని ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌తో దౌత్యపరమైన పరిష్కారానికి మరికొంత సమయం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.