గాజాలో సామాన్య పౌరులను రక్షించాలి: ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్
ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. హమాస్ లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో గాజాలోని సామాన్య పౌరుల రక్షణపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్ సైనికులు దాడి చేసే సమయంలో హమాస్ మిలిటెంట్లు.. సామాన్య ప్రజలను గుర్తించాలని సూచించారు. అలాగే అమాయక ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఇజ్రాయెల్‌దే అని ఆ దేశ ప్రధాని నేతన్యాహుకు బైడెన్ దేశానిర్దేశం చేశారు. ఇజ్రాయెల్‌కు తమను తాము రక్షించుకునే హక్కు ఉన్నప్పటికీ, పౌరుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చే అంతర్జాతీయ మానవతా చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ కాల్‌లో జో బైడెన్ వివరించారు.
గాజాకు మానవతా సాయాన్ని పెంచేందుకు బైడెన్ ఈజిప్టు కృషి
మరోవైపు గాజాకు మానవతా సాయాన్ని పెంచేందుకు ప్రపంచదేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఈజిప్టు అధ్యక్షుడితో కూడా మాట్లాడినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. గాజాకు మనవతా సాయాన్ని పెంచేందుకు ఇద్దరు నేతలు కట్టుబడి ఉన్నారని పేర్కొంది. అలాగే గాజాపై కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత 25 రోజులుగా భీకర యుద్ధం నడుస్తోంది. ఈ యుద్దం కారణంగా ఇజ్రాయెల్ వైపున 1,400 మంది, గాజాలో 8వేల మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్ దళాలు సోమవారం గాజాతో పాటు సిరియా, లెబనాన్‌లోని లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.