LOADING...
Modi-Netanyahu: నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్... కీలకమైన సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని
కీలకమైన సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని

Modi-Netanyahu: నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్... కీలకమైన సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య నెలల తరబడి కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇటీవల గాజా కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ పరిణామం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.నెతన్యాహు తన స్నేహితుడు మోదీతో మాట్లాడటానికి ఇజ్రాయెల్‌లో జరుగుతున్న భద్రతా సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని ఆయన కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

వివరాలు 

బందీల విడుదలకు కుదిరిన ఒప్పందంపై నెతన్యాహును అభినందించిన మోదీ 

హమాస్‌తో కుదిరిన ఒప్పందం విషయమై చర్చించేందుకు ఇజ్రాయెల్‌ భద్రతా క్యాబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. ఇందులో నెతన్యాహుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీ నుంచి కాల్‌ రావడంతో, నెతన్యాహు సమావేశాన్ని కొంతసేపు ఆపి ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ, బందీల విడుదలకు కుదిరిన ఒప్పందంపై నెతన్యాహును అభినందించారని ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అంతేకాక, శాంతి స్థాపన దిశగా భారత్‌ అందిస్తున్న నిరంతర మద్దతుకు నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వివరాలు 

ట్రంప్‌తో  ఫోన్‌లో మాట్లాడిన మోదీ 

తదుపరి,ఈ ఫోన్‌ సంభాషణ గురించి ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌ (X)వేదికలో వివరించారు. "గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సాధించిన పురోగతిని గుర్తుచేస్తూ, నా స్నేహితుడు,ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును అభినందించాను.బందీల విడుదలతో పాటు గాజా ప్రజలకు మానవతా సహాయం పెంచేందుకు కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్‌ స్వాగతిస్తోంది.ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది అంగీకారయోగ్యం కాదని నేను మళ్లీ స్పష్టంగా చెప్పాను" అని మోదీ పోస్ట్‌ చేశారు. దీనికి ముందే ప్రధాని మోదీ,అమెరికా అధ్యక్షుడుట్రంప్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు.చరిత్రాత్మకమైన గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి చేసిన కృషికి ట్రంప్‌ను అభినందించారు.అంతేకాక, ఆ సంభాషణలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలపై కూడా చర్చించుకున్నామని మోదీ వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్