LOADING...
PM Modi: 11వ శతాబ్దం నాటి భారతీయ చారిత్రక సంపదను తిరిగి ఇస్తున్న నెదర్లాండ్స్
11వ శతాబ్దం నాటి భారతీయ చారిత్రక సంపదను తిరిగి ఇస్తున్న నెదర్లాండ్స్

PM Modi: 11వ శతాబ్దం నాటి భారతీయ చారిత్రక సంపదను తిరిగి ఇస్తున్న నెదర్లాండ్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

నెదర్లాండ్స్‌లో ఉన్న భారతీయ చారిత్రక సంపదను తిరిగి భారత్‌కు అప్పగించేందుకు ఆ దేశ ప్రభుత్వం అంగీకరించింది. 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాగి పలకలను భారత్‌కు తిరిగి ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రధాని మోదీ ఇటీవల నెదర్లాండ్స్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం, వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చలు జరిపి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ పర్యటనలోనే భారతీయ చారిత్రక వారసత్వానికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది.

వివరాలు

21 పెద్ద రాగి పలకలు, 3 చిన్న పలకలు 

నెదర్లాండ్స్‌లో భద్రపరిచిన చోళుల కాలం నాటి రాగి పలకలను భారత్‌కు తిరిగి అప్పగించేందుకు ఆ దేశం అంగీకరించినట్లు మోదీ శనివారం X వేదికగా వెల్లడించారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మోదీ తన పోస్టులో.. "11వ శతాబ్దానికి చెందిన చోళుల పలకలను నెదర్లాండ్స్ భారత్‌కు తిరిగి ఇవ్వబోతోంది. ఈ అప్పగింత ప్రక్రియలో నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్తో కలిసి పాల్గొన్నాను. ఇందులో 21 పెద్ద రాగి పలకలు, 3 చిన్న పలకలు ఉన్నాయి. వాటిపై ప్రపంచంలోనే అత్యంత అందమైన భాషల్లో ఒకటైన తమిళం లిఖించబడి ఉంది. ఇవి రాజరాజ చోళుడి తనయుడు రాజేంద్ర చోళుడి కాలానికి చెందినవిగా భావిస్తున్నారని తెలిపారు.

వివరాలు

రాగి పలకలు చోళుల సామ్రాజ్య గొప్పదనానికి నిదర్శనం

ఈ రాగి పలకలు చోళుల సామ్రాజ్య గొప్పదనానికి నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. చోళుల పాలన, సంస్కృతి గురించి భారతీయులు ఎప్పటికీ గర్వపడుతుంటారని అన్నారు. అలాగే ఈ చారిత్రక వస్తువులను భారత్‌కు అప్పగించేందుకు సహకరించిన నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, 19వ శతాబ్దం నుంచి వాటిని సంరక్షిస్తున్న లైడెన్ విశ్వవిద్యాలయానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత ఫొటోలను కూడా మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement