America: ట్రంప్ బొమ్మతో కొత్త డాలర్ నాణెం.. అమెరికా కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో ప్రత్యేకంగా ఒక డాలర్ ($1) నాణేన్ని విడుదల చేయనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ మింట్ ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ బుధవారం వెల్లడించారు. ఈ ప్రత్యేక నాణేనికి ఒక వైపు డొనాల్డ్ ట్రంప్ చిత్రం ఉంటుంది.దానిపై"లిబర్టీ"అనే పదంతో పాటు దిగువన "1776-2026"సంవత్సరాలను ముద్రించనున్నారు. అలాగే చిత్రం పక్కన"ఇన్ గాడ్ వి ట్రస్ట్"అనే వాక్యం ఉంటుంది. నాణేనికి మరోవైపు రెక్కలు విప్పిన గద్ద చిత్రాన్ని ముద్రిస్తారు. గద్ద మధ్యలో 250వ వార్షికోత్సవాన్ని సూచించే సంఖ్యతో కూడిన రక్షణ కవచం (షీల్డ్) ఉంటుంది. దాని చుట్టూ "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా","వన్ డాలర్" అనే అక్షరాలు ఉంటాయి.
వివరాలు
స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక గుర్తుగా
ఈ ప్రకటనపై స్కాట్ బెస్సెంట్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా స్వేచ్ఛ, దేశభక్తికి ప్రతీకగా ఈ కొత్త బంగారు రంగు డాలర్ నాణేన్ని యూఎస్ మింట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ట్రంప్ చిత్రంతో రూపొందించిన ఈ ప్రత్యేక నాణెం అమెరికా విలువలను, స్వేచ్ఛను కాపాడాలనే దేశ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
నిబంధనలకు ప్రత్యేక మినహాయింపు
సాధారణంగా అమెరికాలో జీవించి ఉన్న అధ్యక్షుల చిత్రాలను కరెన్సీ లేదా నాణేలపై ముద్రించరు.
అయితే స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసే ప్రత్యేక సంచికలకు చట్టంలో మినహాయింపు ఉందని అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు
ఇదే తరహాలో 1926లో అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చిత్రంతో ప్రత్యేక నాణేన్ని విడుదల చేసిన విషయాన్ని కూడా అధికారులు గుర్తు చేశారు.
ట్రంప్ చిత్రంతో కూడిన ఈ ప్రత్యేక డాలర్ నాణేన్ని ఎప్పుడు విడుదల చేస్తారు,మొత్తం ఎన్ని నాణేలు ముద్రిస్తారు అనే వివరాలను అమెరికా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా, ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా అనుకూల, ప్రతికూల స్పందనలు వ్యక్తమవుతున్నాయి.