
Pandemic: కొత్త మహమ్మారి అనివార్యం: WHO చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
భవిష్యత్తులో మరో మహమ్మారి(Pandemic)పొంచి ఉందని,అది అనివార్యమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ హెచ్చరించారు.
మహమ్మారి ఎప్పుడూ వస్తుందో కచ్చితంగా చెప్పలేకపోయినా,దాని కోసం ముందస్తుగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్‌వో పాండమిక్ ఒప్పందంపై 13వ పునఃప్రారంభ సమావేశాల్లో టెడ్రోస్ ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా ఆయన కొవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి చూపించిన భయానక పరిణామాలను గుర్తు చేశారు.
మరో మహమ్మారి త్వరలోనే వస్తుందన్న ధృవీకరణ లేదని,కానీ అది వచ్చే అవకాశాన్ని ఉందని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
అది రేపు జరగవచ్చునో,లేక మరికొన్ని దశాబ్దాల తర్వాతో తెలియదు గానీ, ఖచ్చితంగా ఎదురవుతుంది అని స్పష్టంగా చెప్పారు. అందుకే, మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వివరాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 10 ట్రిలియన్ డాలర్ల నష్టం
''కొవిడ్-19 మహమ్మారి సృష్టించిన విలయాన్ని అందరం చూశాం.మనందరికి తెలుసు. అధికారిక లెక్కల ప్రకారం 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కానీ, వాస్తవంగా ఆ సంఖ్య 2 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అంతేకాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 10 ట్రిలియన్ డాలర్లకు మించి నష్టాన్ని కలిగించింది,'' అని టెడ్రోస్ పేర్కొన్నారు.
మహమ్మారి ఒప్పందం విషయంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు అనుకూలంగా సాగుతున్నాయని, సభ్య దేశాల మధ్య త్వరలో ఒక అభిప్రాయ సమ్మతి ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.