 
                                                                                Kathy Hochul: అమెరికాలో తీవ్ర ఆహార సంక్షోభం.. న్యూయార్క్‌లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఆహార కొరత తీవ్రమవుతోంది. ఫెడరల్ ప్రభుత్వ ఆహార సహాయం నిలిచిపోనున్న నేపథ్యంలో, న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర స్థితిని ప్రకటించింది. ఈ నిర్ణయాన్నిగవర్నర్ కేథీ హోచుల్ అధికారికంగా ప్రకటించారు. ఆహార సహాయ కార్యక్రమాలు నిలిచిపోకుండా ఉండేందుకు రాష్ట్రం తరఫున 65 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నిధులతో 4 కోట్లకు పైగా భోజనాలను అందించగలమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల,అమెరికాలోని తక్కువ ఆదాయం గల కుటుంబాలకు ప్రధాన జీవనాధారమైన "సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (SNAP)", లేదా "ఫుడ్ స్టాంప్స్" పథకం ప్రమాదంలో పడింది.
వివరాలు
సొంత నిధులతో ప్రజలను ఆదుకుంటున్న పలు రాష్ట్రాలు
నిధుల కొరత కారణంగా, నవంబర్ నెల ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా వ్యవసాయ శాఖ (USDA) రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశించింది. గవర్నర్ హోచుల్ మాట్లాడుతూ.. "రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్ దేశాన్ని తీవ్రమైన ఆహార సంక్షోభంలోకి నెట్టింది. చట్టబద్ధంగా ఆమోదించబడిన అత్యవసర నిధులను విడుదల చేయకుండా ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది," అని ఆమె విమర్శించారు. ఈ పరిస్థితిలో పలు రాష్ట్రాలు స్వయంగా చర్యలు ప్రారంభించాయి. లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీ గత వారం అత్యవసర స్థితి ప్రకటించి SNAP లబ్ధిదారులకు రాష్ట్ర నిధులను కేటాయించారు. వెర్మంట్ రాష్ట్రం నవంబర్ 15 వరకు ఫుడ్ స్టాంప్స్ పథకాన్ని కొనసాగించేందుకు నిధులను ఆమోదించింది.
వివరాలు
ట్రంప్ ప్రభుత్వంపై దావా
అలాగే న్యూ మెక్సికో ప్రభుత్వం కూడా 30 మిలియన్ డాలర్ల అత్యవసర ఆహార సహాయ నిధిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, 25 రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్ గవర్నర్లు, అటార్నీ జనరళ్లు మంగళవారం ట్రంప్ ప్రభుత్వంపై దావా వేశారు. అత్యవసర నిధులను వినియోగించే అధికారం తమకు లేదని ఫెడరల్ ప్రభుత్వం చెబుతుండడాన్ని వారు సవాలు చేశారు. ప్రజలకు ఆహార సహాయం నిరంతరంగా అందించేందుకు కాంగ్రెస్ ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని వారు కోర్టును కోరారు. ప్రస్తుతం అమెరికాలో SNAP పథకం ద్వారా సుమారు 4.2 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం పేదరిక రేఖకు దిగువన ఉన్నవారే కావడం ప్రత్యేకంగా గమనించదగిన విషయం.