US Election: న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లలో కనిపించే భారతీయ భాష ఇదే!
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి. కమలా హారిస్ అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారా? లేదా,డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేతసౌధంలో అడుగుపెడతారా? అనే విషయంపై అమెరికన్లు తమ తీర్పును ఇవ్వనున్నారు. అయితే,ఓటింగ్‌కు ముందు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఓటర్లకు సౌలభ్యాన్ని కల్పించడానికి వివిధ రాష్ట్రాలు అనేక భాషల్లో బ్యాలెట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. అందులో భాగంగా,200 కంటే ఎక్కువ భాషలు మాట్లాడే న్యూయార్క్‌లో ఇంగ్లీష్‌తో పాటు మరో ఐదు భాషల్లో బ్యాలెట్లు అందించబడ్డాయి. అందులో ఒక భారతీయ భాష కూడా ఉంది,అదే బెంగాలీ.మన జాతీయ భాష అయిన హిందీ కాకుండా బెంగాలీని ఎందుకు ఎంపిక చేశారో తెలుసా?దానికి ఒక కారణం ఉంది.
2013లో క్వీన్స్‌లో బెంగాలీ భాష
భారతీయ భాషలలో హిందీ అత్యధికంగా మాట్లాడినా, భారత్, బంగ్లాదేశ్ నుంచి న్యూయార్క్‌లో నివాసం ఏర్పరుచుకున్న బెంగాలీల సంఖ్య చాలా అధికంగా ఉంది. 1965లో ప్రవేశపెట్టిన ఓటింగ్ హక్కుల చట్టం ప్రకారం, దక్షిణ ఆసియా మైనారిటీ సమూహాలకు భాషా సహాయం తప్పనిసరని ఫెడరల్ ఆదేశాల ప్రకారం 2013లో క్వీన్స్‌లో బెంగాలీ భాషను చేర్చారు. ఎన్నికల ప్రక్రియలో ఇంగ్లీష్‌తో పాటు మరిన్ని నాలుగు భాషలకు అవకాశం కల్పించామని న్యూయార్క్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే రియాన్ చెప్పారు. చైనీస్, స్పానిష్, కొరియన్, బెంగాలీ భాషల్లో బ్యాలెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇక్కడ స్థిరపడ్డ వారికి ఇంగ్లీష్ తెలిసినా, తమ మాతృభాషలో బ్యాలెట్ అందుబాటులో ఉండటం ప్రాంతీయ ప్రజలకు చాలా సంతోషకరమైన అంశమని తెలిపారు.
బెంగాలీ వర్గాలకు సేవకి ఇది మంచి అవకాశం: సుభాష్
న్యూయార్క్‌లో నివాసం ఉన్న బెంగాలీ వర్గాలకు సేవ అందించడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. "నా వంటి వారికి ఇంగ్లీష్ తెలుసు. కానీ మా కమ్యూనిటీలో చాలా మంది తమ మాతృభాషతో మరింత సౌకర్యంగా ఉంటారు. ఇది కచ్చితంగా పోలింగ్ కేంద్రంలో ఉపయోగపడుతుంది. బెంగాలీ బ్యాలెట్ చూసి మా నాన్న సంతృప్తిగా ఉంటారనే నమ్మకం ఉంది," అని టైమ్స్ స్క్వేర్ సేల్స్ ఏజెంట్, బెంగాలీ సుభాష్ అన్నారు.