Donald Trump: త్వరలోనే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్,అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం త్వరలోనే తుది రూపం దాల్చనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తన ఆసియా పర్యటనలో చివరిగా దక్షిణ కొరియాలో ఉన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ ఒప్పందం సంతకం దిశగా అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది. ఇప్పటికే నెలలుగా ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడం, అలాగే టారిఫ్‌లపై తలెత్తిన విభేదాలు చర్చలను నిలిపివేశాయి.
వివరాలు
50 శాతం టారిఫ్‌ను 16 శాతానికి తగ్గించేందుకు సిద్దమైందన్న వార్తలు
ఈ నేపధ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, "నేను భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల నాకు గౌరవం, స్నేహం ఉన్నాయి. మా ఇద్దరి మధ్య అద్భుతమైన సంబంధం ఉంది" అని అన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించేందుకు అంగీకరించడంతో, అమెరికా భారత వస్తువులపై అమల్లో ఉన్న 50 శాతం టారిఫ్‌ను 16 శాతానికి తగ్గించేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ట్రంప్-మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం ఈ పురోగతి సాధ్యమైందని సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా, భారతదేశం జన్యుమార్పిడి చేయని అమెరికన్ మొక్కజొన్న, సోయామీల్ దిగుమతులను పెంచే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలు
ఇదే సందర్భంలో ట్రంప్ మరోసారి ప్రధానమంత్రి మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. భారత్-పాకిస్థాన్ మధ్య మే 10న చోటు చేసుకున్న కాల్పుల విరమణలో తానే కీలక పాత్ర పోషించానని ఆయన మరోసారి ప్రస్తావించారు. అయితే ఈ వాదనను భారత్ గతంలోనే పలు మార్లు ఖండించిన విషయం తెలిసిందే. ట్రంప్ మాట్లాడుతూ,"ఆ రెండు అణు శక్తులు తీవ్రమైన ఉద్రిక్తతల్లో ఉన్నాయి. ఆ సమయంలో నేను మోదీకి ఫోన్ చేసి, 'మీరు పాకిస్థాన్‌తో యుద్ధం ప్రారంభిస్తే,మేము వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగించలేం' అని చెప్పాను" అని ట్రంప్ వివరించారు.
వివరాలు
కాల్పుల విరమణ ఘనత నాదే
'ప్రధాని మోదీ చూడటానికి చాలా మంచి వ్యక్తి, కానీ ఆయన చాలా కఠినుడు. నేను ఫోన్ చేసిన రెండ్రోజుల్లోనే కాల్పులు ఆగిపోయాయి" అని వివరించారు. ట్రంప్ ఇంకా, ఈ కాల్పుల విరమణతో పాటు ఇతర సైనిక ఉద్రిక్తతలను అణచివేసినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కాలని భావిస్తున్నట్లు కూడా తెలిపారు.