బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం
దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ లో దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కాల్పుల మోత మోగుతోంది. ఒకప్పటి రాజధాని నగరమైన రియో డి జెనీరోలో డ్రగ్స్ ముఠాపై బుధవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ మేరకు తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రతి దాడుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు బుల్లెట్ తగిలిన వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ కాసేపటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. మురికివాడల సముదాయంలోని మాదకద్రవ్యాల ముఠాలపై పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే కాల్పులు జరుపుతున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి రియోలో మొత్తం 33 సంఘటనలు జరిగాయని సమాచారం. వాటిల్లో 125 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా.
385 కిలోల భారీ మాదక ద్రవ్యాలు సహా తుపాకీలు స్వాధీనం
సావోపాలో రాష్ట్రంలో 14 మంది చనిపోగా, ఈశాన్య రాష్ట్రం బహియాలో 19 ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బుధవారం రియోలో మరో 9 మంది ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు. అయితే తొలుత సావోపాలో రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 385 కిలోల భారీ మాదక ద్రవ్యాలను, తుపాకీలు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆయా నేరస్థుల ఇళ్లకు వెళ్లగా వారే తొలుత కాల్పులు ప్రారంభించారని పోలీసులు చెప్పారు.ప్రతి కాల్పుల తర్వాతే తప్పని పరిస్థితుల్లో కాల్పులు జరపుతున్నామన్నారు. మరోవైపు ముఠాలపైకి భద్రతా దళాలు భారీ ఆయుధాలతో యుద్ధం చేస్తోందని స్టేట్ హ్యూమన్ రైట్స్ ఆరోపించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది.