LOADING...
Marco Rubio: ఇరాన్‌లో పాలన మారితే ఎవరు అధికారం చేపడతారో తెలియదు: రూబియో
ఇరాన్‌లో పాలన మారితే ఎవరు అధికారం చేపడతారో తెలియదు: రూబియో

Marco Rubio: ఇరాన్‌లో పాలన మారితే ఎవరు అధికారం చేపడతారో తెలియదు: రూబియో

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధనౌకలు, సైనిక బలగాల మోహరింపుతో ఇరాన్‌పై ఎప్పుడు దాడి జరుగుతుందోనన్న ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తొలగిస్తే.. ఆ దేశంలో అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందన్నది చెప్పడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన సెనెట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇస్తూ చేశారు.

వివరాలు 

ఖమేనీ స్థానంలో ఎవరు అధికారం చేపడతారో ఎవరికీ తెలియదు:  రూబియో

ఇరాన్‌లో పాలన మారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న ప్రశ్నలకు స్పందించిన రూబియో.. ఇది ఇప్పటికీ ఓ ఓపెన్ ప్రశ్నగానే మిగిలిందన్నారు. ఖమేనీ స్థానంలో ఎవరు అధికారం చేపడతారో ఎవరికీ తెలియదని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్‌లో అధికార వ్యవస్థ సుప్రీం లీడర్ ఖమేనీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), అలాగే ఎన్నికైన నేతల మధ్య విభజించి ఉందన్నారు. అయితే చివరకు ఈ వ్యవస్థ అంతా ఖమేనీ ఆదేశాల ప్రకారమే పనిచేస్తోందని పేర్కొన్నారు. సుప్రీం లీడర్‌తో పాటు ప్రస్తుతం ఉన్న పాలన కూలిపోతే, ఆ తర్వాత ఇరాన్‌లో పరిస్థితులు ఎలా మారతాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా కష్టమని రూబియో తెలిపారు. ఇది వెనెజువెలాతో పోలిస్తే చాలా క్లిష్టమైన పరిస్థితి అవుతుందన్నారు.

వివరాలు 

పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా సైనిక బలగాల బలోపేతం

ఎన్నో దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వం బలంగా పాతుకుపోయి ఉందని, అలాంటి వ్యవస్థలో మార్పు వస్తే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా సైనిక బలగాలను బలోపేతం చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై కూడా రూబియో స్పందించారు. ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశం ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులను రక్షించడమేనని స్పష్టం చేశారు. సైనిక చర్యలకు దిగాల్సిన పరిస్థితి రాకూడదని తాను ఆశిస్తున్నానని చెప్పారు. అయితే అమెరికా బలగాలు, అలాగే ఆ దేశానికి భాగస్వాములుగా ఉన్న దేశాలపై దాడి చేయగల సామర్థ్యాన్ని ఇరాన్ క్రమంగా పెంచుకుంటోందని రూబియో హెచ్చరించారు. ఈ కారణంగానే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

Advertisement