LOADING...
Donald Trump: హర్మూజ్‌లో టోల్‌ లేదు.. ఇరాన్‌తో డీల్‌ కుదిరిందన్న ట్రంప్
హర్మూజ్‌లో టోల్‌ లేదు.. ఇరాన్‌తో డీల్‌ కుదిరిందన్న ట్రంప్

Donald Trump: హర్మూజ్‌లో టోల్‌ లేదు.. ఇరాన్‌తో డీల్‌ కుదిరిందన్న ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2026
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంలో కీలక అంశంగా 'హర్మూజ్‌ జలసంధి' నిలిచింది. టెహ్రాన్‌తో ఒప్పందం కుదిరినట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, హర్మూజ్‌ జలసంధి మళ్లీ తెరుచుకోనుందని, అక్కడ ఎలాంటి టోల్‌ వసూలు చేయమని స్పష్టం చేశారు. అయితే ఈ ఒప్పందంలో ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం.

వివరాలు

డీల్‌ను ధ్రువీకరించిన ఇరాన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత ఇరాన్‌ అధికారికంగా స్పందించింది. ఐఆర్‌జీసీకి అనుబంధంగా పనిచేసే ఐఆర్‌ఐబీ వార్తా సంస్థ ఈ ఒప్పందాన్ని ఇరాన్‌ విజయంగా అభివర్ణించింది. అమెరికాను చర్చల బల్లపైకి తీసుకురావడంలో టెహ్రాన్‌ విజయం సాధించిందని పేర్కొంది. తదనంతరం ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ కూడా ఈ అవగాహన ఒప్పందాన్ని ధ్రువీకరించింది. లెబనాన్‌తో పాటు ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న వర్గాలపై అమెరికా శాశ్వతంగా సైనిక చర్యలను నిలిపివేయడం, ఇరాన్‌ రేవులపై విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని వెంటనే ఎత్తివేయడం వంటి అంశాలకు అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది.

వివరాలు

జూన్ 19న అధికారికంగా సంతకాలు

ఇరాన్‌ విదేశాంగశాఖ ఉపమంత్రి కాజెమ్‌ గరీబాబడీ ప్రకారం, ఈ ఒప్పందంపై జూన్‌ 19న అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఒప్పందానికి ముందు తుది దశలో 15 గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే ఒప్పందంలోని నిబంధనల అమలుపైనే భవిష్యత్‌ చర్చలు ఆధారపడి ఉంటాయని ఇరాన్‌ స్పష్టం చేసింది

Advertisement

వివరాలు

శుక్రవారం నుంచే హర్మూజ్‌ తెరుచుకోనుంది

జూన్‌ 19న ఒప్పందంపై సంతకాలు పూర్తికాగానే హర్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని ట్రంప్‌ వెల్లడించారు. దీంతో చమురు రవాణా కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయని, సముద్ర మార్గాల్లో ఏర్పాటు చేసిన సీమైన్స్‌ తొలగింపు కూడా మొదలవుతుందని చెప్పారు. దాదాపు 107 రోజులుగా మూతపడిన ఈ కీలక జలమార్గం మళ్లీ ప్రపంచ వాణిజ్యానికి అందుబాటులోకి రానుంది.

Advertisement

వివరాలు

పశ్చిమాసియా ముఖచిత్రమే మారుతుంది: జేడీ వాన్స్

ఇరాన్‌తో కుదిరిన ఈ ఒప్పందం పశ్చిమాసియా భవిష్యత్తుపై గణనీయ ప్రభావం చూపుతుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అభిప్రాయపడ్డారు. రానున్న 50 ఏళ్లలో ఈ ఒప్పందం పశ్చిమాసియా మౌలిక స్వరూపాన్నే మార్చివేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే టెహ్రాన్‌ ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలు సంపాదించలేదని వ్యాఖ్యానించారు. అయితే శుక్రవారం జరగనున్న సంతకాల కార్యక్రమానికి అమెరికా తరఫున ఎవరు హాజరవుతారన్న అంశంపై ట్రంప్‌ కార్యవర్గం ఇంకా చర్చలు జరుపుతున్నట్లు వాన్స్‌ వెల్లడించారు.

వివరాలు

సందేహాలు వ్యక్తం చేసిన లిండ్సే గ్రాహం

ఇదిలా ఉండగా, ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే అమెరికా సెనెటర్‌ లిండ్సే గ్రాహం ఈ ఒప్పందంపై ఆచితూచి స్పందించారు. అమెరికా ప్రతినిధుల బృందం కంటే భిన్నంగా ఇరాన్‌ ఈ ఒప్పందాన్ని చూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అణ్వాయుధాల అంశంలో టెహ్రాన్‌ పూర్తిగా వెనక్కి తగ్గుతుందా అనే విషయంపై సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందంపై ఆశలు పెరుగుతున్నప్పటికీ, కొన్ని కీలక అంశాలపై ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.

Advertisement