అమెరికాను బెదిరించిన మర్నాడే మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
అంతర్జాతీయ దేశాలను ఉత్తర కొరియా ఉలిక్కిపాటుకు గురిచేసింది. రష్యా, ఉక్రెయిన్ ఘటనలు మినహా ప్రపంచం అంతా శాంతితో విరాజిల్లుతున్న క్రమంలో కొరియన్ దేశం చర్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీఎంబీ)ని పరీక్షించింది. ఈ మేరకు జపాన్, దక్షిణ కొరియా దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ దూరం వెళ్లే ఆ క్షిపణి దాదాపు గంటన్నర వరకు గాలిలోనే ప్రయాణించినట్లు సమాచారం. అనంతరం మిస్సైల్ జపాన్ సముద్ర జలాల్లో పడిపోయినట్లు గుర్తించారు. ఇటీవలే అమెరికా నిఘా విమానాలు ఉత్తర కొరియా గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా మరోసారి ఐసీఎంబీ పరీక్షలు నిర్వహించి అగ్రరాజ్యాన్ని హెచ్చరిస్తోంది.
ఉత్తర కొరియా ఆరోపణల్ని ఖండించిన అమెరికా
అమెరికన్ నిఘా విమానాలు తమ గగనమార్గంలోకి ప్రవేశిస్తే వాటిని పేల్చేస్తామని 2 రోజుల క్రితం ఉత్తరకొరియా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఉత్తర కొరియా ఆరోపణల్ని అగ్రరాజ్యం ఖండించింది. తమ సైనిక దళాల పెట్రోలింగ్ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని ప్రకటించింది. ఇటీవలే నార్త్ కొరియా వరుసగా క్షిపణుల్ని పరీక్షిస్తుండంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం అమెరికా, సౌత్ కొరియా దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించింది. అందులో ఓ నిఘా శాటిలైట్ సైతం ఉంది. అయితే నిషేధిత పరీక్ష చేపట్టిన ఉత్తర కొరియా ప్రయోగాలు విఫలమయ్యాయి. ఘన ఇంధనానికి చెందిన ఐసీబీఎంను పరీక్షించినట్లు గత ఏప్రిల్‌లోనే ఉత్తరకొరియా పేర్కొనడం గమనార్హం.