మరోసారి అమెరికా డ్రోన్లను వెంబడించిన రష్యన్ జెట్.. అగ్రదేశాల మధ్య పెరుగుతున్న దూరం
అగ్రరాజ్యం అమెరికాతో రష్యా మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. యూఎస్ డ్రోన్లను వెంటాడటం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి. సిరియాలో రష్యా జెట్ విమానాలు మరోసారి అమెరికన్ డ్రోన్లను వెంబడించాయి. డ్రోన్లకు సమీపంగా వెళ్లడం సహా వాటి పనితీరును దెబ్బతీసేలా ప్రేరేపిస్తునట్లు యూఎస్ వాయుసేన వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.30 సమయంలో సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు సంబంధించి అమెరికా రహస్య ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తమ దేశానికి చెందిన మూడు డ్రోన్లను రష్యన్ ఫైటర్ జెట్ విమానాలు వెంబడించినట్లు యూఎస్ ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రెన్‌కెవిచ్ ప్రకటించారు. రష్యన్ విమానం ప్రమాదకరంగా ఓ డ్రోన్‌కు సమీపం నుంచి వెళ్లిందన్నారు.
రష్యా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి : అమెరికా
అనంతరం పారాచుట్‌లల్లో మంటలు రాజేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంక్యూ-9 (MQ-9) రీపర్ల పనితీరు సామర్థ్యాన్ని దెబ్బతీసేలా ప్రోత్సాహించిందన్నారు. ఈ నేపథ్యంలో రష్యా పోకడలను ఆయన తప్పుపట్టారు. గడిచిన 24 గంటల్లో రష్యా సేనలు ఇలా చేయడం ఇది రెండోసారని ఆయన గుర్తు చేశారు. 2023 మార్చి 15న నల్ల సముద్రంలో అమెరికన్ నిఘా డ్రోన్‌ను రష్యన్ ఫైటర్ జెట్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రొపెల్లర్ ధ్వంసం అయ్యింది. దాంతో సదరు డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో అమెరికా కూల్చేసింది. అంతకుముందు ఓ డ్రోన్‌పై ఫైటర్ జెట్లు ఇంధనాన్ని కుమ్మరించాయని అమెరికా వాయుసేన స్పష్టం చేసింది. రష్యా చర్యలను అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.