Kim Jong Un: సోదరికి కీలక పదోన్నతి.. వారసురాలిగా కుమార్తె ?: కిమ్ కుటుంబంలో కీలక పరిణామాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కొరియాలో అధికారాన్ని పూర్తిగా తన చేతుల్లోనే కేంద్రీకరించుకున్న కిమ్ వంశం,దేశ పాలనపై తన ఆధిపత్యాన్ని మరింత దృఢం చేసుకుంటోంది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్‌కు కీలకమైన పదోన్నతి లభించడం ఈ దిశగా జరిగిన ప్రధాన పరిణామంగా భావిస్తున్నారు. దేశ భవిష్యత్ దిశను నిర్ణయించే వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల వేదికగా ఈ నిర్ణయం వెలువడింది. దీంతో కిమ్ కుటుంబ ఆధిపత్యం మరింత బలపడుతోందన్న సంకేతాలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ)వెల్లడించిన వివరాల ప్రకారం,ఇప్పటివరకు వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సెంట్రల్ కమిటీలో వైస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన కిమ్ యో జోంగ్‌ను ఇప్పుడు పూర్తి స్థాయి డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా నియమించారు.
వివరాలు
పార్టీ కాంగ్రెస్‌లో కీలక నిర్ణయాలు - వారసత్వంపై ఊహాగానాలు
అయితే ఆమెకు ఏ విభాగ బాధ్యతలు అప్పగించారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఐదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పార్టీ కాంగ్రెస్‌లో కిమ్ జోంగ్ ఉన్ పార్టీ జనరల్ సెక్రటరీగా తిరిగి ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా, కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆయన స్థానాన్ని దక్కించుకునే వారసురాలిగా ఆయన టీనేజ్ కుమార్తె కిమ్ జు ఏను తయారుచేస్తున్నారని దక్షిణ కొరియా గూఢచార సంస్థ తాజాగా అంచనా వేసింది. ఈ సమాచారం నిజమైతే 1940ల నుంచి కొనసాగుతున్న కిమ్ కుటుంబ పాలన భవిష్యత్తులో కూడా కొనసాగడం ఖాయం అవుతుంది.
వివరాలు
అణు వ్యూహంపై స్పష్టత లేదు
కిమ్ కుటుంబంలోని మరికొంత మంది సభ్యుల జీవితాలు విషాదకర పరిణామాలతో ముగిసిన నేపధ్యంలో,కిమ్ యో జోంగ్ కీలక స్థానానికి చేరుకోవడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా,కిమ్ జోంగ్ ఉన్ తన సోదరుడు,రాజకీయ ప్రత్యర్థిగా భావించిన కిమ్ జోంగ్ నామ్‌ను 2017లో హత్య చేయించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో దేశ దీర్ఘకాలిక విధానాలు, అభివృద్ధి లక్ష్యాలపై చర్చ జరుగుతోందని కేసీఎన్ఏ వెల్లడించింది. అయితే అమెరికాతో సంబంధాలపై విధానం లేదా అణ్వస్త్ర కార్యక్రమాల గురించి కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దేశ అణు నిరోధక శక్తిని మరింతగా పెంపొందించే కార్యాచరణను ఈ సమావేశాల్లో వెల్లడిస్తానని ఆయన గత నెలలో చెప్పిన విషయం గుర్తుచేయదగినది.