కిమ్‌ను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు; బరువు 140కిలోలు, మద్యపానం, నిద్రలేమితో అవస్థలు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆరోగ్యంపై దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కీలక విషయాలను వెల్లడించింది. కిమ్ ఆరోగ్యం సరిగా లేదని ఆయన పలు రుగ్మతలతో బాధపడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. మే 16న కిమ్ బహిరంగంగా కనిపించినప్పుడు అతని తన కళ్ల చుట్టూ స్పష్టమైన నల్లటి వలయాలతో అలసిపోయినట్లు కనిపించడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరిందని వెల్లడించింది. అంతేకాదు, కిమ్ 140 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉన్నట్లు పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడు యూ సాంగ్-బమ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో కిమ్ బరువును అంచనా వేసినట్లు ఆయన వివరించారు.
అత్యంత రహస్యంగా ఉత్తర కొరియా నాయకుల ఆరోగ్య విషయాలు
సాధారణంగా ఉత్తర కొరియా నాయకుల ఆరోగ్యం, వ్యక్తిగత విషయాలు అత్యంత రహస్యంగా ఉంచబడుతుంది. అవి బయటకు తెలియవు. అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు ఉన్నట్లు దక్షిణ కొరియా నిఘా విభాగం అంచనా వేస్తోంది. ఇంత చిన్న వయసులోనే మద్యానికి బానిసైన కిమ్, అధిక ధూమపానం, బరువు పెరగడం, హృదయ సంబంధ సమస్యలతో తీవ్రమైన నిద్రలేమి రుగ్మతలతో బాధపడుతున్నట్లు తెలిసినట్లు యూ సాంగ్-బమ్ చెప్పారు. ఇందులో కొన్ని సమస్యలు వంశపారపర్యంగా వచ్చినట్లు వెల్లడించారు. ఉత్తర కొరియా పాలకుల ఆధినంలో ఉండే ఆ దేశ ప్రభుత్వ మీడియా నాయకుడి ఆరోగ్యం గురించి చాలా అరుదుగా ప్రస్తావిస్తుంది.