LOADING...
Norway: నార్వే యువరాణి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు.. 10 ఏళ్ల జైలు శిక్షకు అవకాశం
నార్వే యువరాణి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు.. 10 ఏళ్ల జైలు శిక్షకు అవకాశం

Norway: నార్వే యువరాణి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు.. 10 ఏళ్ల జైలు శిక్షకు అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

నార్వేలోనే కాక అంతర్జాతీయంగా కూడా సంచలనం రేపుతున్న పరిణామంలో, నార్వే యువరాణి మెట్టే-మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ (28)పై 32 క్రిమినల్‌ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో నాలుగు అత్యాచారం కేసులు, గృహ హింస, దాడులు, ఇతర తీవ్రమైన నేరాలు ఉన్నాయి. దీర్ఘకాల విచారణ అనంతరం ఈ అభియోగాలను ప్రకటించిన ప్రాసిక్యూటర్లు, వచ్చే ఏడాది ప్రారంభంలో విచారణ మొదలవుతుందని తెలిపారు.

వివరాలు 

కేసు వివరాలు 

ఒస్లో స్టేట్ అటార్నీ స్టుర్లా హెన్రిక్స్‌బో వెల్లడించిన ప్రకారం,హోయిబీ నలుగురు మహిళలపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు నిద్రలో ఉన్న సమయంలో కూడా దాడులు జరిగాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొని,అదే రోజున తర్వాత మళ్లీ అత్యాచారం చేశాడని అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా,బాధితుల అనుమతి లేకుండా వీడియోలు,ఫొటోలు తీశాడని కూడా కేసులో పేర్కొన్నారు. అదనంగా, మాజీ స్నేహితురాలిపై గృహ హింస ఆరోపణలు ఉన్నాయి. ఇతర కేసుల్లో హింసాత్మక దాడులు,ఆస్తి ధ్వంసం,శాంతిభంగం,కోర్టు ఆదేశాల ఉల్లంఘన, హత్య బెదిరింపులు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి. మొత్తం 32 కేసులు నమోదు అయ్యాయి. ఇవన్నీ రుజువైతే, హోయిబీకి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్లు స్పష్టం చేశారు.

వివరాలు 

విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు 

2024 ఆగస్టులో హోయిబీ ఒక మహిళను దాడి చేసిన కేసులో అరెస్ట్ కావడంతో అతని సమస్యలు బహిర్గతమయ్యాయి. ఆ సమయంలో అతను కోకైన్, మద్యం ప్రభావంలో ఉండి హింసకు పాల్పడ్డానని అంగీకరించాడు. మానసిక ఆరోగ్య చికిత్స తీసుకుంటానని కూడా చెప్పాడు. దీని తర్వాత జరిగిన లోతైన విచారణలో 2018 నుంచి 2024 వరకు కొనసాగిన పలు లైంగిక దాడులు, హింసాత్మక చర్యలు బయటపడ్డాయి. కేసు రిజిస్టర్ అయిన తర్వాత కూడా కొన్ని దాడులు జరిగినట్టు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. ఫోటోలు, వీడియోల రూపంలో సాక్ష్యాలు కూడా సేకరించారు.

వివరాలు 

మారియస్‌కి రాజ కుటుంబ హక్కులు లేవు

హోయిబీ యువరాణి మెట్టే-మారిట్ కి కుమారుడు. కానీ అతనికి రాజ కుటుంబ హక్కులు లేవు, వారసత్వ క్రమంలో స్థానం లేదు. ఈ కేసుపై రాయల్ ప్యాలెస్ స్పందిస్తూ.. "మారియస్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పోలీసులు, కోర్టు వ్యవస్థ తగిన విధంగా విచారణ చేస్తుంది. న్యాయవ్యవస్థ న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉంది" అని ప్రకటించింది. కోర్టు ప్రక్రియ హోయిబీ అత్యాచారం, గృహ హింస వంటి ప్రధాన అభియోగాలను ఖండిస్తున్నప్పటికీ, చిన్నపాటి కేసులను మాత్రం ఒప్పుకున్నాడు. తన తరఫు వాదనను పూర్తి వివరంగా కోర్టులో చెప్పనున్నట్టు అతని న్యాయవాది తెలిపారు. ఈ కేసు 2026 జనవరి మధ్యలో ప్రారంభమై, ఆరు వారాల వరకు సాగవచ్చని అంచనా.

వివరాలు 

ఈ కేసు చాలా తీవ్రమైనది

ప్రాసిక్యూటర్ స్టుర్లా హెన్రిక్స్‌బో మాట్లాడుతూ.. "ఈ కేసు చాలా తీవ్రమైనది. అత్యాచారం, కుటుంబ హింసలు బాధితుల జీవితాలను శాశ్వతంగా దెబ్బతీస్తాయి. హోయిబీ రాజ కుటుంబానికి చెందిన కారణంగా శిక్ష నుండి తప్పించుకోకూడదు. సామాన్యుడిని ఎలా చూస్తామో, అతనిని కూడా అలాగే చూడాలి" అని స్పష్టం చేశారు.