Loading...
US-China: చైనాకు 9 లక్షల ఏఐ చిప్స్‌ ఎగుమతి.. ఎన్విడియా, ఏఎండీకి ట్రంప్‌ సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్
ఎన్విడియా, ఏఎండీకి ట్రంప్‌ సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్

US-China: చైనాకు 9 లక్షల ఏఐ చిప్స్‌ ఎగుమతి.. ఎన్విడియా, ఏఎండీకి ట్రంప్‌ సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోరు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. చైనా సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు అత్యాధునిక ఏఐ చిప్స్‌ ఉపయోగపడే అవకాశం ఉందన్న ఆందోళనతో గతంలో వాటి ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఇప్పుడు అదే చైనాకు భారీ సంఖ్యలో ఏఐ చిప్స్‌ ఎగుమతి చేసేందుకు అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడైంది. ఎన్విడియా (Nvidia), ఏఎండీ (AMD) సంస్థలు తయారు చేసిన మొత్తం 8,79,000 అధునాతన ఏఐ చిప్స్‌ చైనాకు పంపేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చినట్లు అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ వెల్లడించింది. ఈ పరిణామంతో అమెరికా సాంకేతిక భద్రత, చైనా గూఢచర్య ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి.

వివరాలు 

34 లక్షల చిప్స్‌ కోసం దరఖాస్తులు

అమెరికా హౌస్‌ ఫారిన్‌ అఫైర్స్‌ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్‌ నుంచి 2026 మే మధ్య కాలంలో చైనాకు 8,79,000 అధునాతన ఏఐ చిప్స్‌ ఎగుమతి చేసేందుకు వాణిజ్య శాఖ అనుమతులు మంజూరు చేసింది.

అయితే ఇదే సమయంలో వివిధ కంపెనీలు ఏకంగా 34 లక్షల చిప్స్‌ ఎగుమతికి అనుమతి కోరడం గమనార్హం.

చైనాలోని ప్రముఖ సాంకేతిక సంస్థలకు కూడా ఈ అనుమతులు లభించాయి.

అలీబాబాకు 75,000,టెన్సెంట్‌కు 1,50,000,బైడూకు 43,000,బీవైడీకి 4,000చిప్స్‌ ఎగుమతి చేసేందుకు అనుమతులు ఇచ్చినట్లు కమిటీ తెలిపింది.

అయితే లైసెన్సులు మంజూరు చేసినంత మాత్రాన ఆ చిప్స్‌ అన్నీ చైనాకు చేరినట్లు కాదని స్పష్టం చేసింది. వాస్తవంగా ఎన్ని చిప్స్‌ రవాణా అయ్యాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

వివరాలు 

జెన్‌సన్‌ హువాంగ్‌ వివాదం వేళ వివరాల వెల్లడి

ఎన్విడియా మాజీ సీఈఓ జెన్‌సన్‌ హువాంగ్‌కు సంబంధించినట్లు ప్రచారంలో ఉన్న వ్యక్తిగత సంబంధాల వివాదం,ఆలిస్‌ హువాంగ్‌ అనే మహిళపై చైనా గూఢచారి అన్న అనుమానాలు ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.

అయితే ఈ ఆరోపణలకు స్వతంత్రంగా ఎలాంటి నిర్ధారణ లేదు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే చిప్స్‌ ఎగుమతి లైసెన్సులకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ బ్రయాన్‌ మాస్ట్‌.. ఎగుమతి నియంత్రణ సంస్కరణల చట్టం కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి ఎన్విడియా, ఏఎండీ సంస్థలు సమర్పించిన దరఖాస్తుల వివరాలను వెల్లడించారు.

మరోవైపు, నివేదికలో ప్రస్తావించిన నాలుగు చైనా సంస్థలను పెంటగాన్‌.. చైనా సైన్యానికి మద్దతు ఇచ్చే సంస్థలుగా గుర్తించినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

హెచ్‌200, ఎంఐ325ఎక్స్‌ చిప్స్‌కు అనుమతి

దీంతో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో వాణిజ్య అనుమతులు ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చైనాకు ఎగుమతి చేసేందుకు అనుమతులు పొందిన చిప్స్‌లో ఎన్విడియాకు చెందిన హెచ్‌200 (H200), ఏఎండీ తయారు చేసిన ఎంఐ325ఎక్స్‌ (MI325X) ఉన్నాయి.

అత్యాధునిక ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం, భారీ మొత్తంలో డేటాను విశ్లేషించడం వంటి కీలక పనులకు ఈ చిప్స్‌ ఉపయోగపడతాయి.

అయితే చైనాకు ఎగుమతులకు అనుమతులు ఇచ్చినప్పటికీ కఠినమైన నిబంధనలు, పరిమితులు విధించినట్లు ఎన్విడియా వెల్లడించింది.

కొన్ని లైసెన్సులు పొందినప్పటికీ హెచ్‌200 చిప్స్‌ను చైనాకు రవాణా చేయడాన్ని నిలిపివేసినట్లు సంస్థ తెలిపింది. ఈ పరిణామాలపై ఏఎండీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

బైడెన్‌ ఆంక్షలు.. ట్రంప్‌ సడలింపులు

అమెరికా, చైనా మధ్య సాంకేతిక రంగంలో పోటీకి ప్రధాన కారణం కృత్రిమ మేధ (ఏఐ)లో ఆధిపత్యం సాధించడమే.

అత్యాధునిక చిప్స్‌ అందుబాటులోకి వస్తే చైనా తన సైనిక, నిఘా, సాంకేతిక సామర్థ్యాలను మరింత పెంచుకునే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది.

ఈ కారణంతోనే గతంలో జో బైడెన్‌ ప్రభుత్వం చైనాకు ఏఐ చిప్స్‌ ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది.

అయితే తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ ప్రభుత్వం గత డిసెంబర్‌లో ఈ విధానాన్ని మార్చింది.

ఎన్విడియాకు చెందిన హెచ్‌200 చిప్స్‌ ఎగుమతికి అనుమతి ఇచ్చింది. తాజాగా వెల్లడైన గణాంకాలు ఈ విధాన మార్పుపై మరోసారి చర్చకు దారితీశాయి.

వివరాలు 

వాణిజ్య మంత్రి లుట్నిక్‌ పదవికి ముప్పు?

ఈ చిప్స్‌ వ్యవహారం ట్రంప్‌ ప్రభుత్వంలోని కీలక అధికారులపైనా ప్రభావం చూపుతోంది.

అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ పదవిపై వైట్‌హౌస్‌లో చర్చలు జరుగుతున్నట్లు గతవారం రాయిటర్స్‌ కథనం ప్రచురించింది.

చైనా కంపెనీలను అమెరికా వాణిజ్య బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే విషయంలో జాప్యం చేయడం, ఎన్విడియా చిప్స్‌ ఎగుమతుల పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయన్న ఆరోపణలపై చట్టసభ సభ్యులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

అయితే లుట్నిక్‌కు ట్రంప్‌ మద్దతుగా నిలిచారు. వివాదం కొనసాగుతున్నప్పటికీ వాణిజ్య మంత్రికి వైట్‌హౌస్‌ అండగా ఉంటుందని ప్రకటించింది.

మరోవైపు, అత్యాధునిక అమెరికా చిప్స్‌ చైనాకు అక్రమంగా తరలిపోతున్నాయన్న నివేదికలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగిందన్న ఆరోపణలు కూడా ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి.

ADVERTISEMENT