LOADING...
Zohran Mamdani: మళ్లీ చర్చకు కోహినూర్‌ వజ్రం.. భారత్‌కు తిరిగిచ్చేయాల్సిందేనన్న న్యూయార్క్ మేయర్
మళ్లీ చర్చకు కోహినూర్‌ వజ్రం.. భారత్‌కు తిరిగిచ్చేయాల్సిందేనన్న మమ్దానీ

Zohran Mamdani: మళ్లీ చర్చకు కోహినూర్‌ వజ్రం.. భారత్‌కు తిరిగిచ్చేయాల్సిందేనన్న న్యూయార్క్ మేయర్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

చారిత్రక ప్రాధాన్యం కలిగిన కోహినూర్‌ వజ్రం అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూయార్క్ నగర మేయర్‌గా ఉన్న భారతీయ వంశానికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. తాను అవకాశం దొరికితే బ్రిటన్ రాజు చార్లెస్ 3ను కలుసుకుని కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాజు చార్లెస్ 3,రాణి కెమిల్లా అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు 9/11 స్మారక స్థలాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మమ్దానీ మాట్లాడుతూ, ఒక అధికారిక కార్యక్రమం కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం లభిస్తే కోహినూర్ విషయాన్ని ప్రస్తావిస్తానని పేర్కొన్నారు.

వివరాలు 

మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన బకింగ్‌హామ్ రాజభవనం

ఆ తర్వాత రాజు చార్లెస్ 3, మమ్దానీ మధ్య సంభాషణ జరిగినప్పటికీ, ఆ చర్చల్లో కోహినూర్ వజ్రం అంశం వచ్చినదా లేదా అన్నది స్పష్టతకు రాలేదు. మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు బకింగ్‌హామ్ రాజభవనం నిరాకరించింది. అలాగే వారి సమావేశానికి సంబంధించిన వివరాలను మేయర్ కార్యాలయం వెల్లడించలేదు. కాగా.. భారత్‌ (India)కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో మహారాజు దులీప్ సింగ్ బ్రిటన్ రాణి విక్టోరియాకు అప్పగించారు. అప్పటి నుంచి అది బ్రిటన్ రాజ కుటుంబ అధీనంలోనే ఉంది. ప్రస్తుతం ఆ వజ్రం రాణి కిరీటంలో అమర్చబడి ఉంది. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని భారత్ ప్రభుత్వం దౌత్యపరంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఫలితం రాలేదు.

Advertisement