Sharif: పొగడ్తలకు ఒలింపిక్స్ పెడితే షెహబాజ్ షరీఫ్'కి స్వర్ణం.. పాక్ మాజీ దౌత్యవేత్త
ఈ వార్తాకథనం ఏంటి
సమయం దొరికినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై ప్రశంసల వర్షం కురిపించే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మళ్లీ వార్తల్లో నిలిచారు. ట్రంప్ పై షరీఫ్ చూపిస్తున్న ఈ అభిమానాన్ని పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ (Husain Haqqani) ఎద్దేవా చేశారు. "ట్రంప్‌ను పొగిడే వారికి ఒలింపిక్స్‌లో పోటీలు జరిగితే షెహబాజ్ షరీఫ్ ఖచ్చితంగా బంగారు పతకం గెలుస్తారు" అంటూ హక్కానీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హక్కానీ గతంలో అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పనిచేశారు. ఇక ఇటీవల ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపు కోసం జరిగిన శాంతి సమావేశంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
వివరాలు
ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు
గాజాలో శాంతి నెలకొనేందుకు ట్రంప్ చేసిన అవిశ్రాంత కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయన కొనియాడారు. ప్రపంచానికి శాంతి, సమృద్ధిని తీసుకురావడానికి ట్రంప్ చూపిన కృషి అమోఘమని, ఆయన నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని షరీఫ్ ప్రశంసలు కురిపించారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గటానికి కూడా ట్రంప్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. అలాగే థాయిలాండ్-కంబోడియాల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా ఇచ్చిన మద్దతు పట్ల కూడా కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలు
పాకిస్తాన్‌లో పెద్ద దుమారం
అయితే షరీఫ్ తరచూ ట్రంప్‌ను పొగడడం పాకిస్తాన్‌లో పెద్ద దుమారం రేపింది. అమెరికా అధ్యక్షుడి చేతిలో కీలుబొమ్మలా ప్రవర్తించి దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని అక్కడి ప్రజలు ఆయనను విమర్శిస్తున్నారు. ట్రంప్‌ను అంతగా మహిమాపరిచే అవసరం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పాకిస్తాన్ చరిత్రకారుడు అమర్ అలీ జాన్ (Ammar Ali Jan) కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ - షెహబాజ్ షరీఫ్ తరచూ ట్రంప్‌ను అవసరంలేకుండా ప్రశంసించడం పాకిస్తానీయులకు అసౌకర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.