LOADING...
Oman: ఒమన్ చమురు టర్మినల్‌లో భారీ పేలుడు.. నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్
ఒమన్ చమురు టర్మినల్‌లో భారీ పేలుడు.. నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్

Oman: ఒమన్ చమురు టర్మినల్‌లో భారీ పేలుడు.. నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒమన్‌లోని మినా అల్ ఫహల్ ఆయిల్ టర్మినల్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు అనంతరం పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు ఇరాన్‌కు చెందిన డ్రోన్ దాడే కారణమని స్థానిక అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పేలుడు నేపథ్యంలో టర్మినల్‌లో జరుగుతున్న చమురు లోడింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో చమురు రవాణా కోసం అక్కడికి చేరుకున్న పలువురు సూపర్ ట్యాంకర్లు టర్మినల్ పరిసరాల్లోనే నిలిచిపోయాయి. కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే వరకు అవి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

అమెరికా యుద్ధ నౌకపై దాడి చేశామన్న ఇరాన్

ఇదిలా ఉండగా, ఒమన్ సముద్రంలో అమెరికాకు చెందిన ఓ సైనిక నౌకను లక్ష్యంగా చేసుకుని తమ నౌకాదళం దాడి నిర్వహించిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. ఇరాన్ జలాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సమయంలో ఆ నౌకపై చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. అయితే ఈ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా ఖండించింది. ఒమన్ సముద్ర జలాల్లో ఉన్న అమెరికా సైనిక ఆస్తులన్నీ సురక్షితంగానే ఉన్నాయని, ఏ నౌకపైనా దాడి జరగలేదని స్పష్టం చేసింది.

వివరాలు 

కువైట్ విమానాశ్రయ నష్టంపై పరస్పర ఆరోపణలు

మరోవైపు, ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల కారణంగానే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిందని కువైట్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తోసిపుచ్చింది. విమానాశ్రయ టెర్మినల్‌కు జరిగిన నష్టానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఐఆర్‌జీసీ పేర్కొంది. అమెరికా రూపొందించిన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ విధ్వంసం సంభవించిందని ఆరోపించింది. దీనికి ప్రతిస్పందించిన అమెరికా సైన్యం, ఐఆర్‌జీసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే డ్రోన్లతో పౌర విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ఇరాన్ అమెరికాపై నిరాధార ఆరోపణలు చేస్తోందని పేర్కొంది.

Advertisement