Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. చైనాకు మేం కూడా ముప్పే..
ఈ వార్తాకథనం ఏంటి
చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచాలని పిలుపునిచ్చిన కొద్ది రోజులకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చైనాకు అమెరికా కూడా ఒక ముప్పుగా మారిందని ఆయన అంగీకరించారు. రెండు దేశాల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోందని, ఒకరినొకరు నిరంతరం గమనిస్తూనే ఉన్నారని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా చైనా అమెరికా పవర్ గ్రిడ్‌లు, నీటి సరఫరా వ్యవస్థల్లోకి చొరబడి, మేధో సంపత్తిని దొంగిలిస్తోందన్న అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల ఆరోపణల మధ్య ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వివరాలు
ఇరు దేశాలు ఒకరినొకరు నిరంతరం గమనిస్తుంటాయని వ్యాఖ్య
సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, "మేము కూడా వాళ్లకు ముప్పుగా మారాం. వాళ్లపై మీరు చెబుతున్న అనేక పనులు మేము కూడా వాళ్లపై చేస్తుంటాం. ఇది పూర్తిగా పోటీతో నిండిన ప్రపంచం, ముఖ్యంగా అమెరికా-చైనా సంబంధాల విషయంలో ఇది నిజం. మేము వాళ్లను ఎప్పుడూ గమనిస్తుంటాం, వాళ్లు మమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారు" అని అన్నారు. అయితే చైనాతో తగవులు పెట్టుకోవడం కంటే కలసి పనిచేస్తేనే రెండు దేశాలు మరింత బలంగా ఎదుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
చైనా అణ్వాయుధాలను వేగంగా తయారు చేస్తోందని ఆందోళన
అలాగే చైనాలో పెరుగుతున్న అణ్వాయుధ సామర్థ్యంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా అత్యంత వేగంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని, వచ్చే ఐదేళ్లలో రష్యా, అమెరికాలతో సమానంగా నిలుస్తుందని ఆయన అంచనా వేశారు. "ప్రస్తుతం ప్రపంచంలో అణ్వాయుధాలు ఎక్కువగా అమెరికాకే ఉన్నాయి, రష్యా రెండో స్థానంలో ఉంది. చైనా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నప్పటికీ, ఐదేళ్లలో మాతో సమాన స్థాయికి చేరుకుంటుంది. వాళ్లు అణ్వాయుధాలను అద్భుత వేగంతో తయారు చేస్తున్నారు" అని ఆయన తెలిపారు. అలాగే, నిరాయుధీకరణ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో తాను చర్చించినట్లు వెల్లడించారు.
వివరాలు
రేర్ ఎర్త్ ఖనిజాల విషయంలో చైనాదే పైచేయి అని అంగీకారం
ఆర్థిక పరంగా చైనాపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ట్రంప్ చెప్పినా,'రేర్ ఎర్త్ మినరల్స్' (అరుదైన భూమి ఖనిజాలు)విషయంలో మాత్రం చైనాకు పైచేయి ఉందని ఆయన అంగీకరించారు. కంప్యూటర్లు నుంచి ఆయుధాల తయారీ వరకు అమెరికాకు ఈ ఖనిజాలు కీలకమని చెప్పారు. "గత 25 నుంచి 30 ఏళ్లలో చైనా ఈ ఖనిజాలను విస్తృతంగా సేకరించి, వాటిని తన శక్తిగా మలుచుకుంది. వాటిని ఇప్పుడు మన మీదే వాడుతోంది. అయితే మేం కూడా విమానాల విడిభాగాలు వంటి అంశాలను వారి పై వ్యూహాత్మకంగా ఉపయోగించాం" అని వివరించారు. ఇక ఆరేళ్ల విరామం తర్వాత అక్టోబర్ 30న దక్షిణ కొరియాలో జరిగిన 32వఅపెక్ ఆర్థిక మంత్రుల సమావేశంలో అమెరికా,చైనా నేతలు ముఖాముఖి సమావేశమైన విషయం తెలిసిందే.