'One Equals Four': ఒకటికి నాలుగు.. మా లెక్క వేరే: అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ కఠినంగా స్పందించింది. మూడు రోజుల్లో ఒప్పందం కుదరకపోతే చమురు పైప్‌లైన్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ చమురు క్షేత్రాలు లేదా మౌలిక వసతులపై ఎలాంటి దాడి జరిగినా, అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాల్లో నాలుగు రెట్లు ఎక్కువ నష్టం కలిగిస్తామని స్పష్టం చేశారు. తమ లెక్కలు సాధారణంగా ఉండవని, శత్రువులు ఒక చమురు బావిని లక్ష్యంగా చేసుకుంటే తాము నాలుగు బావులపై దాడి చేస్తామని తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు, ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
వివరాలు
చర్చలకోసం తమ ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపొద్దని ట్రంప్ ఆదేశం
ఇదిలా ఉండగా,ఆదివారం ఓ అమెరికా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోకపోతే టెహ్రాన్‌లోని చమురు పైప్‌లైన్లను పేల్చివేస్తామని తెలిపారు. చమురు ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు కావడంతో,దాన్ని దెబ్బతీస్తే ఇరాన్ తప్పక తమమాట వినాల్సి వస్తుందని పేర్కొన్నారు. చర్చలకోసం తమ ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపొద్దని కూడా ఆదేశించినట్లు చెప్పారు. యుద్ధంముగియాలంటే ఇరాన్ నాయకులే ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు,అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ కూడా ఆసక్తి చూపలేదు. తమ డిమాండ్లను పాకిస్తాన్ అధికారులకు అందజేసిన ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయారు. అలాగే,ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం.