LOADING...
Nepal: నేపాల్‌లో మళ్లీ నిరసనలు... బాలెన్ షా ప్రభుత్వంపై ఒత్తిడి.. కారణాలు ఇవే 
నేపాల్‌లో మళ్లీ నిరసనలు... బాలెన్ షా ప్రభుత్వంపై ఒత్తిడి.. కారణాలు ఇవే

Nepal: నేపాల్‌లో మళ్లీ నిరసనలు... బాలెన్ షా ప్రభుత్వంపై ఒత్తిడి.. కారణాలు ఇవే 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో మరోసారి నిరసనలు ఉధృతమయ్యాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలకే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. భారతీయ వస్తువులపై సుంకం విధించే నిర్ణయం, హోం మంత్రి సుడాన్ గురుంగ్‌పై అవినీతి ఆరోపణలు వంటి పరిణామాలు ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. ఖాట్మండ్‌లోని సింఘా దర్బార్ వద్ద ప్రారంభమైన చిన్న నిరసన కొద్ది గంటల్లోనే పెద్ద ఆందోళనగా మారింది. ఖాట్మండ్‌తో పాటు దేశంలోని ఇతర పట్టణాల్లో కూడా నిరసనలు విస్తరించాయి. విద్యార్థులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వివరాలు 

నిరసనలకు కారణాలు

భారతీయ వస్తువులపై సుంకం భారతదేశం నుంచి దిగుమతి అయ్యే రూ. 100కు పైగా విలువైన వస్తువులపై సుంకం విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై అదనపు భారం మోపుతుందని నిరసనకారులు పేర్కొంటున్నారు. విద్యార్థి సంఘాల పట్ల నిర్లక్ష్యం విద్యార్థి సంఘాలను, ముఖ్యంగా రాజకీయ అనుబంధం ఉన్న సంఘాలను పక్కన పెట్టాలన్న ప్రభుత్వ వైఖరి కూడా ఆందోళనకు దారి తీసింది. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వివరాలు 

అవినీతి ఆరోపణలు

హోం మంత్రి సుడాన్ గురుంగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరసనలను మరింత ఉధృతం చేశాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఒక వ్యాపారవేత్తతో షేర్ల లావాదేవీలు జరిపినట్టు ఆరోపణలు రావడం కలకలం రేపింది. దీంతో గురుంగ్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Advertisement

వివరాలు 

గురుంగ్ రాజీనామా

ఈ నేపథ్యంలో హోం మంత్రి సుడాన్ గురుంగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను ప్రధానమంత్రి బాలెన్ షాకు సమర్పించడంతో పాటు, తన నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. సెప్టెంబర్‌లో జరిగిన యువత నిరసనల అనంతరం ప్రజాదరణ పొందిన గురుంగ్, మార్చి 5 ఎన్నికల్లో గోర్ఖా నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అనంతరం హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పదవిలోకి వచ్చిన తొలి రోజుల్లోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుని ప్రజల మద్దతు పొందారు. అయితే తాజాగా ఆయనపై వచ్చిన ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

Advertisement

వివరాలు 

పదవి కంటే నైతిక విలువలే ముఖ్యం 

తన రాజీనామాపై స్పందించిన గురుంగ్... తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరగాలని, అందుకే పదవికి వైదొలుగుతున్నానని తెలిపారు. తనకు పదవి కంటే నైతిక విలువలే ముఖ్యమని స్పష్టం చేశారు. గత ఏడాది నేపాల్‌లో యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసనలతో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ఆరు నెలలకు, ఈ ఏడాది మార్చి 27న కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంలో బాలెన్ షా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మళ్లీ నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

Advertisement