Sam Altman: ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై సోదరి సంచలన ఆరోపణలు..
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తన సోదరి సంచలన ఆరోపణలు చేశారు.
దాదాపు పదేళ్ల పాటు శామ్ తనపై లైంగిక వేధింపులు చేశాడని ఆమె ఆరోపిస్తూ, మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు దాఖలు చేశారు.
తనకు మూడేళ్ల వయసు నుంచే ఈ దారుణాలను అనుభవించానని, శామ్ తనకు 12 ఏళ్ల వయసులో ఈ చర్యలకు పాల్పడ్డాడని ఆమె పేర్కొన్నారు.
1997 నుంచి 2006 వరకు వారానికి అనేక సార్లు ఈ వేధింపులు జరిగాయనీ, ఈ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడి, భవిష్యత్తులో ఈ సమస్యలు కొనసాగవచ్చని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు.
వివరాలు
ఆరోపణలను ఖండించిన శామ్ ఆల్ట్‌మన్ కుటుంబ సభ్యులు
తన ఇంట్లోనే, క్లేటన్‌లో జరిగిన ఈ సంఘటనల గురించి ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనూ ఓసారిగా ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా ఈ ఆరోపణలు చేసినప్పటికీ, ఇప్పుడు కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఆరోపణలపై శామ్ ఆల్ట్‌మన్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ,ఆరోపణలను ఖండించారు.వారు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ,ఆమె మానసిక స్థితి సరిగా లేదని,ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యురాలిగా ఆమెకు అండగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ,ఆమె తగిన సహకారం అందించడం లేదని పేర్కొన్నారు.
ఆమె శామ్ సహా కుటుంబంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని,డబ్బు కోసం నిరంతరం ఒత్తిడి చేస్తోందని,దీనివల్ల కుటుంబం మరింత బాధ పడుతోందని వివరించారు.
వివరాలు
ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని ప్రపంచానికి పరిచయం చేసిన శామ్ ఆల్ట్‌మన్
తండ్రి నిధులను అక్రమంగా తీసుకుని కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తూ, ఇప్పుడు మరింత దిగజారి లైంగిక వేధింపుల ఆరోపణలకు దిగిందని, ఇవన్నీ అవాస్తవాలని వారు స్పష్టం చేశారు.
కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరుతూ, ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు.
ఓపెన్‌ఏఐ సీఈఓగా, ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని ప్రపంచానికి పరిచయం చేసిన శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
గత ఏడాది అతన్ని కంపెనీ నుంచి తొలగించిన వివాదం పెద్ద దుమారానికి దారితీసింది.
ఉద్యోగులు, వాటాదారుల ఒత్తిడితో కంపెనీ బోర్డు తిరిగి శామ్‌ను పదవిలోకి తీసుకుంది. గతేడాది ఆరంభంలో శామ్ తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌తో వివాహం చేసుకున్నారు.