Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌కు మరణశిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ఆయన సోదరుడు మాహెర్ అల్ అసద్‌కూ ఇదే శిక్షను ఖరారు చేసింది. దేశంలో 14 ఏళ్ల పాటు కొనసాగిన అంతర్యుద్ధం సందర్భంగా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌పైనా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ ఉద్యమాలను అణచివేసిన కేసులో నజీబ్‌కు కూడా మరణదండన విధించింది. తీర్పు వెలువడిన సమయంలో నజీబ్ మాత్రమే న్యాయస్థానంలో హాజరయ్యారు. బషర్, మాహెర్ మాత్రం దేశం వెలుపల ఉన్నందున వారి గైర్హాజరీలోనే విచారణ జరిగింది.
వివరాలు
రష్యాకు పరార్..
2024 డిసెంబరులో తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసద్ పాలనకు తెరపడింది.
అనంతరం బషర్ అల్ అసద్, ఆయన సోదరుడు మాహెర్ రష్యాకు వెళ్లిపోయారు. మరోవైపు అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌ను స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఎవరీ అతేఫ్ నజీబ్?
అతేఫ్ నజీబ్ సిరియా సైన్యంలో బ్రిగేడియర్ జనరల్‌గా పనిచేశారు. దారా ప్రావిన్స్‌లోని రాజకీయ భద్రతా విభాగానికి ఆయన అధిపతిగా వ్యవహరించారు.
2011లో దారా ప్రాంతంలో జరిగిన నిరసనలను అణచివేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు కేసులో ఆరోపణలు ఉన్నాయి.
ఈ పరిణామాలే సిరియాలో పెద్ద ఎత్తున ఉద్యమానికి, అనంతరం అంతర్యుద్ధానికి దారితీశాయి.
వివరాలు
5 లక్షల మందికిపైగా మృతి
మాహెర్ అల్ అసద్ కూడా సిరియా సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయన గతంలో సైన్యంలోని నాలుగో ఆర్మర్డ్ డివిజన్‌కు కమాండర్‌గా వ్యవహరించారు.
బషర్ అల్ అసద్ పాలనలో భద్రతా బలగాల చర్యల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు అంతర్జాతీయ రికార్డుల్లో నమోదైంది.
సిరియాలో కొనసాగిన అంతర్యుద్ధం భారీ ప్రాణనష్టానికి కారణమైంది.
సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనాల ప్రకారం.. ఈ ఘర్షణల్లో దాదాపు ఐదు లక్షల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2011లో ప్రారంభమైన హింసాత్మక పరిణామాలు ఏళ్ల తరబడి కొనసాగి దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి.
ప్రస్తుత తీర్పు అసద్ పాలనలో చోటుచేసుకున్న ఆరోపణలపై సిరియా కొత్త అధికార యంత్రాంగం చేపట్టిన న్యాయ ప్రక్రియలో కీలక పరిణామంగా నిలిచింది.