LOADING...
Mossad: ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మొస్సాద్‌.. విరుచుకుపడిన ఇజ్రాయెల్‌
ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మొస్సాద్‌.. విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

Mossad: ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మొస్సాద్‌.. విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌కు చెందిన గూఢచార సంస్థ మొస్సాద్‌ ఇటీవల ఇరాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని రహస్యంగా కొన్ని ఆపరేషన్లు నిర్వహించినట్లు సమాచారం. ఈ చర్యల వల్ల ఇజ్రాయెల్‌కు ఇరాన్‌పై వైమానిక దాడులు చేయడానికి మార్గం సులభమైంది. యాక్సియోస్‌ రిపోర్టర్‌ బరాక్‌ రవిడ్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం, ''ఇరాన్‌ దేశవ్యాప్తంగా ఉన్న దీర్ఘశ్రేణి క్షిపణి కేంద్రాలు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై మొస్సాద్‌ నిర్వహించిన రహస్య కార్యకలాపాల వలన గణనీయమైన నష్టాలు సంభవించాయి'' అని ఆయన CNNకు చెప్పారు. ఈ కార్యకలాపాలన్నీ నేరుగా ఇరాన్‌ దేశ భూభాగంలోనే జరిగినట్లు వెల్లడించారు. సాధారణంగా యుద్ధాల్లో మొదట ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల పనితీరును అడ్డుకోవడానికి S.E.A.D. (Suppression of Enemy Air Defenses)ఆపరేషన్లను అమలు చేస్తారు.

వివరాలు 

ఫైటర్‌ జెట్ల ద్వారా ప్రత్యక్ష దాడులకు..

వీటిలో డ్రోన్లు, క్షిపణులు ఉపయోగించి మొదట గగనతల రక్షణ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తారు. ఆ తర్వాత ఫైటర్‌ జెట్ల ద్వారా ప్రత్యక్ష దాడులకు దిగుతారు. అయితే ఈ తరహాలో కాకుండా, ఇజ్రాయెల్‌ మొస్సాద్‌ రహస్య కార్యకలాపాల ద్వారా ఎయిర్‌ డిఫెన్స్‌లను ధ్వంసం చేయడం ప్రత్యేకంగా పరిగణించవచ్చు. 2024లో ఏప్రిల్‌, అక్టోబర్‌ నెలల్లో ఇరాన్‌పై దాడులకు ముందు కూడా మొస్సాద్‌ పలు రహస్య ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే, 2018లో ఈ నిఘా సంస్థ ఇరాన్‌ అణుశాస్త్ర సంబంధిత గోప్యమైన పత్రాలను దొంగిలించింది. ఈ చర్యల వలన ప్రపంచానికి ఇరాన్‌ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని స్పష్టంగా చూపగలిగింది.

వివరాలు 

ఇరాన్‌కు చెందిన 100 డ్రోన్లు నాశనం

ఆ తర్వాత 2022లో మరో రహస్య ఆపరేషన్‌ ద్వారా ఇరాన్‌కు చెందిన దాదాపు 100 డ్రోన్లను నాశనం చేసింది. ఈ విషయం నాటి ఇజ్రాయెల్‌ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్‌ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన వ్యాసంలో ధ్రువీకరించారు. 2023లో కూడా ఇరాన్‌ భూభాగంలో ఇలాంటివే మరికొన్ని ఆపరేషన్లు జరిగాయని, వాటికి మొస్సాద్‌ సంబంధముందని ఇరాన్‌ ఆరోపించింది. ఇరాన్‌లో ఉన్న నతాంజ్‌ అణు కేంద్రంపై ఇజ్రాయెల్‌ చాలా కాలంగా నిఘా కొనసాగిస్తూ వస్తోంది. ఈ కేంద్రంపై 2020 జూలై,2021 ఏప్రిల్‌ నెలల్లో మొస్సాద్‌ రహస్యంగా దాడులు చేసి, అక్కడి కీలక సాంకేతిక పరికరాలను ధ్వంసం చేసింది. 2020లో ఇరాన్‌ ప్రముఖ అణు శాస్త్రవేత్త మొహసెన్‌ ఫక్రిజాదెను హత్య చేసిన ఘటన ఇదే ఆపరేషన్‌లో భాగంగా జరిగింది.

వివరాలు 

తాజాగా మృతి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు 

ఇటీవల జరిగిన ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించినవారిలో ప్రముఖ ఇరాన్‌ అణు శాస్త్రవేత్త డాక్టర్‌ ఫెరెయుద్దీన్‌ అబ్బాసీ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా ఈ దాడుల్లో మృత్యువాతపడ్డారు. అంతేగాక షహిద్‌ బెష్తీ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌ ఫ్యాకల్టీ డీన్‌గా పనిచేసిన డాక్టర్‌ అబ్దుల్‌ హమిడ్‌ మినౌచెహర్‌, అదే కళాశాలలో అధ్యాపకుడిగా ఉన్న అహ్మద్‌ రజా జుల్ఫాఘరి కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.