
UK flight delays: యూకేలో విమాన రాకపోకలకు అంతరాయం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సంభవించిన సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కారణంగా 100కి పైగా విమానాలు రద్దయ్యాయి. పలు ముఖ్యమైన విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. హీత్రో, గాట్విక్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, కార్డిఫ్, ఎడిన్‌బర్గ్, లండన్ వంటి ప్రముఖ విమానాశ్రయాల్లో ఈ సాంకేతిక లోపం తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే, ఈ సమస్యను సుమారు 20 నిమిషాల్లో పరిష్కరించినట్లు నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) ఒక అధికార ప్రకటనలో తెలిపింది.
వివరాలు
సమస్య పరిష్కారం అయినప్పటికీ..
"మా వ్యవస్థలు ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. విమానాల రాకపోకలు మామూలు స్థితికి చేరుకున్నాయి. అన్ని విమానాశ్రయాల్లో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సమస్య కారణంగా ప్రభావితమైన విమానాశ్రయాలయలతో మేము కలిసి పని చేస్తున్నాం. ఈ ఇబ్బందులతో బాధపడిన ప్రయాణికులందరినీ మేము చింతిస్తున్నాం, వారికి క్షమాపణలు చెబుతున్నాం" అని పేర్కొన్నారు. బ్రిటన్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన హీత్రో ఎయిర్‌పోర్ట్‌లోనూ ఈ సమస్య ప్రభావం చూపించింది. ఎన్‌ఏటీఎస్ స్వాన్విక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌లో ఎదురైన సాంకేతిక లోపం వల్ల తమ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని హీత్రో అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సాంకేతిక సమస్య పరిష్కారమైనప్పటికీ, కొన్ని విమానాశ్రయాల్లో ఆలస్యాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు.
వివరాలు
2023 ఆగస్టులో కూడా యూకేలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య
2023 ఆగస్టు నెలలో కూడా యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తింది. అప్పట్లోనూ దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ ఎన్‌ఏటీఎస్ తక్షణమే చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించింది.