
Kapil Sharma: కెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై మళ్లీ కాల్పులు.. రంగంలోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మకు చెందిన కెనడాలోని కేఫ్ మరోసారి కాల్పుల ముప్పుకు గురైంది. సుర్రే నగరంలో ఉన్న 'క్యాప్స్ కేఫ్' వద్ద గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బుల్లెట్లు వర్షం కురిపించారు. ఈ నెలలోనే ఇది రెండోసారి జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడికి తాము కారణమని గ్యాంగ్‌స్టర్లు గోల్డీ ధిల్లాన్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లు సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా ప్రకటించడంతో పాటు, వచ్చే దాడి ముంబైలో జరుగుతుందని హెచ్చరికలు జారీ చేయడం మరింత కలకలం రేపుతోంది.
వివరాలు
కేఫ్ బయట పెట్రోల్ బాంబు
వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 4:40 గంటల ప్రాంతంలో 'క్యాప్స్ కేఫ్' వద్ద అనూహ్యంగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకున్నారు. దుండగుల బుల్లెట్ల వర్షం కారణంగా కేఫ్ కిటికీల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో కేఫ్‌లో సిబ్బంది ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కేఫ్ బయట ఒక పెట్రోల్ బాంబును కూడా గుర్తించి, దానిని స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.
వివరాలు
కేఫ్ వద్ద 25 రౌండ్లకు పైగా కాల్పులు జరిపిన దుండగులు
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అందులో దుండగులు సుమారు 25 రౌండ్లకు పైగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. "మేం టార్గెట్‌కు కాల్ చేశాం, కానీ స్పందన రాలేదు. అందుకే ఈ చర్యకు దిగాం. ఇప్పటికీ మా హెచ్చరిక పట్టించుకోకపోతే, తదుపరి దాడి ముంబయిలో జరుగుతుంది" అని ఆ వీడియోలో ఒక గొంతు హెచ్చరించింది. ఈ ముప్పు నేపథ్యంలో ముంబయి పోలీసులు,కేంద్ర భద్రతా ఏజెన్సీలు అత్యంత అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించాయి. ఈ కేఫ్‌పై ఇదే మొదటి దాడి కాదు.గత జులై 10న కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో కేఫ్ కిటికీలపై 10కి పైగా బుల్లెట్ గుర్తులను పోలీసులు గుర్తించారు.
వివరాలు
సిక్కుల సంప్రదాయ దుస్తులపై కపిల్ శర్మ వ్యాఖ్యలు
అప్పట్లో ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) సభ్యుడు హర్జిత్ సింగ్ లడ్డీ ఈ దాడికి తామే కారణమని ప్రకటించాడు. కపిల్ శర్మ షోలో సిక్కుల సంప్రదాయ దుస్తులపై చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ చర్యకు పాల్పడ్డామని అతడు చెప్పాడు. ఇటీవలి వరుస దాడులపై కేఫ్ యాజమాన్యం స్పందిస్తూ.. తాము హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, 'క్యాప్స్ కేఫ్' ఎల్లప్పుడూ ఆత్మీయతకు, ఐక్యతకు, సమాజానికి ప్రతీకగా నిలుస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు, కెనడా పోలీసులు రెండు దాడులపై సమాంతరంగా విచారణ కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.