Faroe Islands: ఫారో దీవుల్లో ఘోరం.. ఒక్క రోజులో 700కుపైగా తిమింగలాలు,డాల్ఫిన్ల ఊచకోత
ఈ వార్తాకథనం ఏంటి
నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఫారో దీవుల్లో జరిగిన సామూహిక సముద్ర జీవుల ఊచకోత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అక్కడి సంప్రదాయ వేట పద్ధతి 'గ్రైండాడ్రాప్'లో భాగంగా ఒక్క రోజులోనే 700కుపైగా తిమింగలాలు, డాల్ఫిన్లను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 27న జరిగిన ఈ ఘటన అనంతరం సముద్ర తీర ప్రాంతం రక్తంతో ఎర్రగా మారిన దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ సంస్థ 'సీ షెఫర్డ్' వెల్లడించిన వివరాల ప్రకారం,టోర్షావన్‌లోని సాండెగెర్డి బే వద్ద వేటగాళ్లు 402 పైలట్ తిమింగలాలు,నాలుగు బాటిల్‌నోస్ డాల్ఫిన్లను ఒడ్డుకు తరలించి చంపేశారు. అలాగే స్కాలబోట్నూర్ ప్రాంతంలో 168 వైట్‌సైడెడ్ డాల్ఫిన్లు, హాల్విక్ ప్రాంతంలో మరో 132 వైట్‌సైడెడ్ డాల్ఫిన్లను వేటాడారు.
వివరాలు
సీ షెఫర్డ్ ఫారో దీవుల డైరెక్టర్ వాలెంటీనా క్రాస్ట్ తీవ్ర ఆగ్రహం
ఈ వేట సందర్భంగా జంతువులను చంపేందుకు ఉపయోగించే ప్రత్యేక ఆయుధాలు సరిపోకపోవడంతో కొందరు వేటగాళ్లు కొక్కేలు, కత్తులతో వాటి శరీరాలను చీల్చినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆ సముద్ర జీవులు ఒడ్డున విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాయి. ఈ దారుణ ఘటనను చిన్నారులు సహా అనేక మంది ప్రత్యక్షంగా వీక్షించడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై సీ షెఫర్డ్ ఫారో దీవుల డైరెక్టర్ వాలెంటీనా క్రాస్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక సముద్ర జీవులను ఇంత క్రూరంగా హింసించి చంపడాన్ని ఏ పరిస్థితుల్లోనూ సమర్థించలేమని ఆమె పేర్కొన్నారు. 'గ్రైండాడ్రాప్' సంప్రదాయాన్ని వెంటనే నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు.
వివరాలు
అనాగరికమైన, కాలం చెల్లిన పద్ధతి
అయితే, ఫారో దీవుల ప్రజలు ఈ సామూహిక వేటను సుమారు వెయ్యేళ్ల నాటి సంప్రదాయంగా పేర్కొంటున్నారు. కానీ జంతు హక్కుల కార్యకర్తలు, పర్యావరణవేత్తలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆధునిక సమాజంలో ఇలాంటి చర్యలకు స్థానం లేదని, ఇది అనాగరికమైన, కాలం చెల్లిన పద్ధతి అని విమర్శిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సామూహిక వేటకు ముందు రోజు ఫారోస్ పార్లమెంట్‌లో వేటాడే డాల్ఫిన్ల సంక్షేమానికి సంబంధించిన చట్టంలో సవరణలు చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.