
Khawaja Asif: మీ విమానాల శిథిలాల కిందే సమాధి చేస్తాం.. భారత్ వార్నింగ్‌కు పాక్ స్ట్రాంగ్ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత సైనిక,రాజకీయ నాయకత్వం ఇటీవల చేసిన హెచ్చరికలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహంతో స్పందించింది. భారత్‌ను తమ యుద్ధవిమానాల శిథిలాల కింద సమాధి చేస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొన్ని రోజుల క్రితం భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది,రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు పాకిస్థాన్‌ను తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని ఆపకపోతే, పాకిస్థాన్‌ను ప్రపంచ పటంలో నుండి పూర్తిగా తొలగించాల్సి వస్తుందని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకే ప్రతిస్పందనగా ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతను రేకెత్తించాయి.
వివరాలు
భారత్ నుంచి వస్తున్నవి రెచ్చగొట్టే వ్యాఖ్యలన్న పాకిస్థాన్
భారత్ నాయకులవి రెచ్చగొట్టే వ్యాఖ్యలని,'ఆపరేషన్ సిందూర్'తరువాత దెబ్బతిన్న తమ ప్రతిష్ఠను రక్షించుకోవడానికే భారత నేతలు విఫలయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. "గతంలో మీరు 0-6 స్కోరుతో ఓటమి చవిచూశారు.మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి ఫలితం మరింత ఘోరంగా ఉంటుంది"అంటూ ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అయితే,ఈ '0-6'స్కోరు అంటే ఏమిటో ఆయన స్పష్టంగా చెప్పలేదు.అయితే,పాకిస్థాన్ 'ఆపరేషన్ సిందూర్'సందర్భంగా ఆరు భారత యుద్ధవిమానాలను కూల్చివేశామనే ఆధారరహిత ప్రచారాన్ని పునరుద్ఘాటించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు,దేశ సమగ్రతను కాపాడేందుకు అవసరమైతే ఏ సరిహద్దును దాటడానికైనా వెనుకాడబోమని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కఠినంగా హెచ్చరించారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా చరిత్రనే కాక భూగోళాన్నీ మార్చే స్థాయిలో భారత్ ప్రతిస్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.