LOADING...
Masood Azhar: మహిళలకు ఆన్‌లైన్‌ జిహాద్‌ శిక్షణ.. జైషే కొత్త ఆన్‌లైన్‌ కుట్ర బహిర్గతం
మహిళలకు ఆన్‌లైన్‌ జిహాద్‌ శిక్షణ.. జైషే కొత్త ఆన్‌లైన్‌ కుట్ర బహిర్గతం

Masood Azhar: మహిళలకు ఆన్‌లైన్‌ జిహాద్‌ శిక్షణ.. జైషే కొత్త ఆన్‌లైన్‌ కుట్ర బహిర్గతం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' తర్వాత, తమ నెట్‌వర్క్‌ను మళ్లీ విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ (Jaish-e-Mohammed) కొత్త వ్యూహాన్ని అవలంబించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈసారి వారు తొలిసారిగా మహిళలతో ప్రత్యేక బ్రిగేడ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీనితో పాటు ఆ బ్రిగేడ్‌ సభ్యులకు ఆన్‌లైన్‌లో ఉగ్రవాద శిక్షణ కోర్సులు (Online Jihadi Course) నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ కోర్సుకు 'తౌఫత్‌ అల్‌ ముమినాత్‌' అనే పేరు పెట్టారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు 

నాయకత్వం వహిస్తున్న జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ చెల్లెళ్లు

ఈ కార్యక్రమానికి జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ చెల్లెళ్లు.. సాదియా అజార్‌,సమైరా అజార్‌ ప్రధానంగా నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడైంది. 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో భారత్‌ బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రంపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో మసూద్‌ అజార్‌ కుటుంబానికి చెందిన 10 మంది, అందులో సాదియా భర్త యూసఫ్‌ అజార్‌ కూడా మరణించారు. మరోవైపు, మసూద్‌ సోదరి సమైరా అజార్‌ భర్త ఉమర్‌ ఫరూక్‌, పుల్వామా దాడి కుట్రదారుడు, గతంలో భారత భద్రతా దళాల చేత ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

వివరాలు 

నవంబర్ 8 నుంచి సెషన్లు ప్రారంభం

ఇప్పుడు సాదియా, సమైరా ఇద్దరూ కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా బ్రిగేడ్‌కు మతపరమైన పాఠాలు, జిహాద్‌కు సంబంధించిన సిద్ధాంతాలు బోధిస్తున్నట్లు నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఈకోర్సు ద్వారా మరిన్ని మహిళలను ఉగ్రవాద మార్గంలోకి దారితీసే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ఈబ్రిగేడ్‌లో జైషే కమాండర్ల భార్యలతో పాటు, బహవల్‌పూర్‌, కరాచీ, ముజఫరాబాద్‌, కోట్లీ, హరీపూర్‌ ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలను సభ్యులుగా చేర్చుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 8 నుంచి ఈ ఆన్‌లైన్‌ సెషన్లు ప్రారంభం కానున్నాయి.ప్రతిరోజూ సుమారు 40 నిమిషాల పాటు మసూద్‌ చెల్లెళ్లు,కమాండర్ల కుటుంబ సభ్యులు మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఇందుకోసం బ్రిగేడ్‌లో చేరిన సభ్యుల నుంచి విరాళాలు సేకరించే చర్యలు కూడా జరుగుతున్నాయని సమాచారం.

వివరాలు 

అప్రమత్తమైన భారత అధికారులు

నిఘా వర్గాల అంచనా ప్రకారం, ఈ కొత్త మహిళా బ్రిగేడ్‌ భారత్‌లో తన నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నం చేయవచ్చని హెచ్చరించారు. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా జమ్మూకశ్మీర్‌,ఉత్తరప్రదేశ్‌ (యూపీ) వంటి ప్రాంతాల్లో మహిళలను ఆకర్షించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.