
Pakistan-Afghanistan: దోహా వేదికగా పాక్, అఫ్గాన్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై శాంతి చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చాయి. దోహా వేదికగా జరిగిన ఈ చర్చల్లో ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వం వహించిన ఈ చర్చలు రెండు విడతలుగా జరిగాయి. శాశ్వత శాంతి, స్థిరత్వం లక్ష్యంగా చర్చించిన ఇరు పక్షాలు తక్షణ కాల్పుల విరమణపై ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందాన్ని కొనసాగించే అంశంపై రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరపాలని కూడా పరస్పరం అంగీకరించాయి. సమావేశాలకు ఇరుదేశాల రక్షణ మంత్రులు హాజరయ్యారు. చర్చల సందర్భంగా పక్క దేశం నుంచి జరుగుతున్న దాడులకు మాత్రమే తాము ప్రతిస్పందిస్తున్నామనే వాదనలను రెండు పక్షాల ప్రతినిధులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
Details
పాక్ వైమానిక దాడుల్లో 10 మంది మృతి
అఫ్గానిస్థాన్ నుంచి వస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టడం, సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణ లక్ష్యంగానే తమ చర్యలని పాకిస్థాన్ పేర్కొంది. అయితే ఉగ్రవాదులకు తమ భూభాగంలో ఆశ్రయం కల్పిస్తున్నారన్న ఆరోపణలను అఫ్గానిస్థాన్ ఖండించింది. ఇటీవల శుక్రవారం అర్ధరాత్రి అఫ్గాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులను పాక్ భద్రతా వర్గాలు ధృవీకరించాయి. తమ చర్యల్లో పౌరులు ప్రాణాలు కోల్పోలేదని, డజన్ల మంది సాయుధ దళాల సభ్యులు మాత్రమే మరణించారని పాక్ పేర్కొంది. అయితే ఆ దాడుల్లో యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులు సహా కనీసం 10 మంది మృతి చెందారని అఫ్గాన్ అధికారులు వెల్లడించారు.