
Pakistan: హైజాకర్లకు ఆశ్రయం కల్పిస్తూ పాక్ చట్టసవరణ.. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మళ్లీ తన అసలైన రంగును బయటపెట్టింది. ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణశిక్షను తొలగిస్తూ, దానిస్థానంలో యావజ్జీవ శిక్షను ప్రతిపాదిస్తూ చట్టంలో సవరణలు చేసింది. తాజాగా 'క్రిమినల్ చట్ట సవరణ బిల్లు 2025'కు పాక్ సెనెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు పాక్ పీనల్ కోడ్ ప్రకారం హైజాకింగ్‌కు పాల్పడిన వారిని ఉద్దేశపూర్వకంగా కాపాడితే మరణశిక్ష విధించేది. అలాగే, మహిళలను బహిరంగంగా దౌర్జన్యం చేసి వివస్త్రం చేస్తే ఏడేళ్ల శిక్ష ఉండేది. 1983లో జియా ఉల్ హక్ పాలనలో దానిని మరణశిక్షగా మార్చారు. కాగా ఈ శిక్షలు హింసాత్మకంగా ఉన్నాయని వాదిస్తూ కొంతకాలంగా పాక్‌లో వాదనలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు మరణశిక్షలను తొలగించి, యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టాన్ని మార్చారు.
Details
నేరాలపై కొత్త దృక్కోణం
నిర్దిష్టంగా కొన్ని తీవ్రమైన నేరాలకు మాత్రమే ఇకపై మరణశిక్ష ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. మిగిలిన కేసుల్లో యావజ్జీవ శిక్షే గరిష్ఠంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ నిర్ణయంపై పాక్ రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు.
Details
భారత్‌కు మళ్లీ హెచ్చరిక
ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆదరణనిస్తున్న దేశంగా ప్రపంచం చూస్తోంది. ఇటీవల పహల్గాం దాడిలోనూ పాక్ ముద్ర స్పష్టమైంది. భారత్‌పై పలు ఉగ్రదాడులకు పాల్పడిన లష్కరే తొయ్యిబా, జైషే మహ్మద్ ముఠాలు పాక్ గడ్డపై నుంచే శిక్షణ కేంద్రాలు నడుపుతున్న విషయం విదితమే. లష్కరే అధినేతకు జైలు అని చెబుతున్నా,అతడికి వీఐపీ వసతులు కల్పిస్తున్నారని నిఘావర్గాల సమాచారం. అదే విధంగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పాక్ ప్రభుత్వం స్వయంగా భద్రత కల్పిస్తున్నట్టు ఇటీవల కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. మొత్తానికి, ఉగ్రవాదులపై పాక్ ప్రభుత్వ దృష్టికోణం ప్రపంచానికి మరోసారి బహిర్గతమైంది. శిక్షలను తగ్గిస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు పాక్ ఉగ్రవాదంపై ఉన్న ప్రమేయాన్ని పటాపంచలు చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.