LOADING...
Pakistan: పాకిస్థాన్ 'ఓపెన్ వార్' ప్రకటన.. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి!
ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి!

Pakistan: పాకిస్థాన్ 'ఓపెన్ వార్' ప్రకటన.. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2026
08:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడూ ఖయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రెండు దేశాల మధ్య సరిహద్దు వద్ద ఘర్షణలు మరింత ముదిరాయి. ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్ పాలకవర్గం దీన్ని బహిరంగ యుద్ధంగా ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "మా ఓర్పుకు హద్దులు దాటిపోయాయి. ఇక ఇది ప్రత్యక్ష యుద్ధమే" అని వెల్లడించారు. ఈ ప్రకటనలు రెండు దేశాల మధ్య పరిస్థితి ఎంత తీవ్రమైందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

వివరాలు 

భూదాడుల్లో ఆఫ్ఘాన్ ఎనిమిది మంది సైనికులు మృతి 

ఇక గత ఆదివారం ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా గురువారం రాత్రి ఆఫ్ఘాన్ సైన్యం పాకిస్థాన్ సరిహద్దు చెక్‌పోస్టులపై దాడులు చేసి, పన్నెండు కంటే ఎక్కువ ఆర్మీ పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించింది. ఈ భూదాడుల్లో తమ ఎనిమిది మంది సైనికులు మరణించినట్లు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో శుక్రవారం పాకిస్థాన్ సైన్యం కాబూల్, కందహార్, పక్తియా ప్రాంతాల్లో వైమానిక దాడులు చేపట్టింది. కాబూల్ నగరంలో కనీసం మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

ముందుగా ఆఫ్ఘాన్ కాల్పులు జరగడంతోనే ఈ దాడులు: పాకిస్థాన్ సైన్యం

ఆఫ్ఘాన్ వైపు నుంచి ముందుగా కాల్పులు జరగడంతోనే ఈ దాడులు నిర్వహించామని పాకిస్థాన్ సైన్యం స్పష్టం చేసింది. అట్టౌల్లా తరార్ వివరాల ప్రకారం, కాబూల్, కందహార్, పక్తియాలోని తాలిబాన్ రక్షణ స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు తెలిపారు. "ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్" పేరుతో ఈ సైనిక చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ప్రభుత్వ అనుకూల మీడియా కథనాల ప్రకారం, రెండు బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు, ఒక కార్ప్స్ హెడ్‌క్వార్టర్, గోలాల నిల్వ కేంద్రాలు ధ్వంసమైనట్లు సమాచారం ఇచ్చింది.

Advertisement

వివరాలు 

పౌరులను లక్ష్యంగా చేసుకున్న ఆఫ్ఘాన్ :మొహన్ నఖ్వీ

అయితే ఈ దాడుల్లో జరిగిన ప్రాణనష్టం గురించి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహన్ నఖ్వీ, ఆఫ్ఘాన్ తాలిబాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని తీవ్రంగా విమర్శించారు. "దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడము" అని ఆయన స్పష్టం చేశారు. ఈ పరస్పర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ బహిరంగ యుద్ధం ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎటువైపు దారితీస్తాయోనన్న అనిశ్చితి నెలకొంది.

Advertisement