Asim Munir: పాక్ సీడీఎఫ్‌గా ఆసిమ్ మునీర్ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్మీ చీఫ్‌గా విధులు నిర్వహించిన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు దేశంలోని అత్యున్నత సైనిక బాధ్యతను అప్పగించింది. ఆయనను పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్)గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం నుంచి నోటిఫికేషన్ వెలువడింది. ఆర్మీ చీఫ్‌గా మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. మూడు సైనిక దళాలు- ఆర్మీ,నేవీ,ఎయిర్‌ఫోర్స్- కార్యకలాపాలను ఒకే కమాండ్ కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా పాక్ ప్రభుత్వం సీడీఎఫ్ అనే కొత్త పదవిని ఏర్పాటు చేసింది.
వివరాలు
దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఆసిమ్ మునీర్
ఐదేళ్ల వ్యవధికి ఏకకాలంలో అన్ని దళాల చీఫ్‌గా వ్యవహరించేందుకు ఆసిమ్ మునీర్‌ను నియమించాలని ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ చేసిన సిఫారసును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించినట్లు అధ్యక్ష భవనం తెలిపారు. ఈసంవత్సరం మునీర్‌కు అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. ఇది సైన్యంలో అత్యున్నతస్థాయి పదవి కావడం విశేషం. పాక్ చరిత్రలో ఇప్పటివరకు జనరల్ అయూబ్ ఖాన్‌కే ఈ గౌరవం దక్కింది. తాజాగా అదే హోదాతో పాటు సీడీఎఫ్‌గా కూడా మునీర్ బాధ్యతలు చేపట్టారు. ఈనియామకంతో దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఆయనే నిలవనున్నారు. చట్టపరంగా ఆయనకు అధ్యక్షుడితో సమానంగా భద్రత కలిగే విధంగా రక్షణ ఉంటుంది. ఆయన్ను ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం కూడా ఉండదు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
వివరాలు
సందిగ్ధత మధ్య నోటిఫికేషన్?
సీడీఎఫ్ నియామకానికి ముందుగా పాకిస్థాన్‌లో పలు ఊహాగానాలు వెల్లువెత్తాయి. ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఉద్దేశపూర్వకంగా నియామకాన్ని ఆలస్యం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం కూడా సాగింది. అయితే ఎట్టకేలకు ఆ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ ప్రభుత్వం సీడీఎఫ్ నియామక నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది.