Pakistan Ex-Minister: హఫీజ్ సయీద్‌కు బానిసనంటూ భారత్‌పై పాక్ మాజీ మంత్రి తీవ్ర హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు తాను 'గులాం'నని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాకుండా లష్కరే తోయిబా ముఖ్య నేతలతో కలిసి వేదికను పంచుకుంటూ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
వివరాలు
ఫోన్ నంబర్ ఉందని అమెరికా నిషేధించిందట
ఒక బహిరంగ సభలో ప్రసంగించిన షేక్ రషీద్.. ''నేను హఫీజ్ సాహెబ్‌కు బానిసను'' అని పేర్కొన్నారు.
తన మొబైల్ ఫోన్‌లో హఫీజ్ సయీద్ ఫోన్ నంబర్ ఉండటం వల్లే అమెరికా తనపై ఆంక్షలు విధించిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ సంస్థ సలహా కమిటీ సభ్యుడు కారీ మహ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి రషీద్ వేదికపై కనిపించారు.
వివరాలు
భారత్‌పై తీవ్ర హెచ్చరికలు
అదే సభలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని షేక్ రషీద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ వైపు భారత్ కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
భారత్ పూర్తిగా నాశనమవుతుందని, ఆ తర్వాత అక్కడ పక్షులు కూడా కూయవని, ఆలయాల్లో గంటలు మోగవని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరాలకు కారణమయ్యాయి. పాకిస్థాన్‌తో పాటు హఫీజ్ సయీద్‌కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రషీద్ స్పష్టం చేశారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు
షేక్ రషీద్ అహ్మద్ 2020 నుంచి 2022 వరకు అప్పటి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
వివరాలు
పాక్ వైఖరిపై మరోసారి విమర్శలు
గతంలో కీలకమైన ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి.. ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాదిగా గుర్తించిన హఫీజ్ సయీద్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ మంత్రి స్థాయి వ్యక్తి ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న వ్యక్తులకు బహిరంగంగా మద్దతు పలకడం పాకిస్థాన్ వైఖరిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా పాకిస్థాన్ చెబుతున్న మాటలకు, అక్కడి రాజకీయ నాయకుల బహిరంగ ప్రకటనలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దీంతో షేక్ రషీద్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లోనే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా మారాయి.