LOADING...
Pakistan: బంగాళాఖాతంపై పాక్‌ కన్ను.. హంగోర్‌ జలాంతర్గాములతో కొత్త ఎత్తుగడ!
బంగాళాఖాతంపై పాక్‌ కన్ను.. హంగోర్‌ జలాంతర్గాములతో కొత్త ఎత్తుగడ!

Pakistan: బంగాళాఖాతంపై పాక్‌ కన్ను.. హంగోర్‌ జలాంతర్గాములతో కొత్త ఎత్తుగడ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం తర్వాత బంగాళాఖాతం వైపు చూసే సాహసం కూడా చేయని పాకిస్థాన్‌.. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది. చైనా సహకారంతో అత్యాధునిక హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను నౌకాదళంలో చేర్చుకుంటూ బంగాళాఖాతంలో సైనిక ఉనికిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్థాన్‌ నౌకాదళానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి. పాకిస్థాన్‌ ఇప్పటికే చైనా నుంచి మొత్తం ఎనిమిది హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో తొలి జలాంతర్గామి ఇటీవల పాక్‌కు చేరింది. దానికి భద్రతగా వెళ్తున్న నౌకాదళ బృందానికి నాయకత్వం వహించిన కమోడోర్‌ ఒమర్‌ ఫరూఖీ శ్రీలంకలో మీడియాతో మాట్లాడారు.

వివరాలు 

భారత్‌కు ఎందుకు కీలకం?

హంగోర్‌ సబ్‌మెరైన్లు తమ నౌకాదళ సామర్థ్యాన్ని అరేబియా సముద్రం దాటి మరింత విస్తరింపజేస్తాయని, బంగాళాఖాతంలో కూడా సైనిక శక్తిని మోహరించే అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన చెప్పారు. ఇవి తమ నేవీకి గేమ్‌ ఛేంజర్‌గా మారతాయని వ్యాఖ్యానించారు. బంగాళాఖాతం ఏ ఒక్క దేశానికి చెందిన సముద్ర ప్రాంతం కాదు. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక వంటి దేశాలు దీనికి తీర ప్రాంతాలుగా ఉన్నాయి. సాధారణంగా తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలు, 200 నాటికల్‌ మైళ్ల వరకు ప్రత్యేక ఆర్థిక మండలిగా గుర్తిస్తారు. ఆ పరిధి దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. అక్కడ ఏ దేశ నౌకలైనా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సంచరించవచ్చు.

వివరాలు 

పాక్‌ వ్యూహం ఎంతవరకు సఫలమవుతుంది ?

భారత్‌కు బంగాళాఖాతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. తూర్పు నౌకాదళ కమాండ్‌ ప్రధాన కేంద్రం ఇక్కడే ఉంది. విశాఖపట్నం కేంద్రంగా భారత అణు జలాంతర్గాముల కార్యకలాపాలు సాగుతుంటాయి. కీలక సముద్ర కమ్యూనికేషన్‌ మార్గాలతో పాటు బంగ్లాదేశ్‌ సహా అనేక దేశాలతో వాణిజ్యానికి ఇదే ప్రధాన సముద్ర మార్గం. భారత నౌకాదళ బలంతో పోలిస్తే పాకిస్థాన్‌ నేవీ సామర్థ్యం చాలా పరిమితంగానే ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్‌ వద్ద విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు, అధునాతన యుద్ధనౌకలు ఉండగా.. పాకిస్థాన్‌ మాత్రం చైనా, తుర్కియే దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రస్తుతం చైనా తయారీ టైప్‌ 054ఏ/పీ ఫ్రిగేట్లు, తుర్కియే నిర్మించిన మిల్జెమ్‌ కార్వెట్‌లు పాక్‌ నేవీకి ప్రధాన బలంగా ఉన్నాయి.

Advertisement

వివరాలు 

బంగ్లాతో దోస్తీ వల్లే..

ఈ నేపథ్యంలో హంగోర్‌ జలాంతర్గాములు చేరినా బంగాళాఖాతంలో శక్తి సమీకరణాలను పూర్తిగా మార్చే పరిస్థితి లేదని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాంతంలో పాకిస్థాన్‌ సైనిక మోహరింపులు పెరగడం మాత్రం భారత్‌కు వ్యూహాత్మకంగా కొత్త సవాళ్లు తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. 1971 యుద్ధం తర్వాత దాదాపు తెగిపోయిన ఈ బంధాలు.. 2024లో బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కొత్త మలుపు తిరిగాయి. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. రక్షణ రంగ సహకారం బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరాచీ-ఛట్టోగ్రామ్‌ మధ్య తొలిసారిగా నేరుగా సముద్ర వాణిజ్యం మొదలైంది.

Advertisement

వివరాలు 

హంగోర్‌ జలాంతర్గామి ప్రత్యేకత ఏమిటి?

గత ఏడాది నవంబర్‌లో పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌక పీఎన్‌ఎస్‌ సైఫ్‌ నాలుగు రోజుల పాటు ఛట్టోగ్రామ్‌ తీరంలో మోహరించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాల మధ్యే బంగాళాఖాతంలో పాక్‌ నౌకాదళ ఉనికిపై చర్చ మొదలైంది. హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను చైనా అభివృద్ధి చేసింది. వీటిలో ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ (AIP) టెక్నాలజీని ఉపయోగించారు. సాధారణ డీజిల్‌-ఎలక్ట్రిక్‌ జలాంతర్గాములతో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం నీటిలోనే ప్రయాణించగలవు. దీంతో శత్రు దేశాలకు వీటిని గుర్తించడం, ట్రాక్‌ చేయడం కష్టమవుతుంది. 1971 యుద్ధం తర్వాత అరేబియా సముద్రానికే పరిమితమైన పాకిస్థాన్‌ నౌకాదళం ఇప్పుడు తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఎనిమిది హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను నౌకాదళంలో చేర్చుకుంటోంది.

వివరాలు 

1971 యుద్ధంలో హంగోర్‌ పాత్ర

బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన పీఎన్‌ఎస్‌ హంగోర్‌ జలాంతర్గామి టోర్పిడో దాడితో భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ ఖుక్రీని ముంచేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌కు చెందిన యుద్ధనౌక ఒకటి యుద్ధంలో మునిగిపోవడం అదే తొలిసారి. అయితే, ఆ ఘటన యుద్ధ ఫలితాన్ని మార్చలేకపోయింది. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన సంయుక్త దాడుల ముందు పాకిస్థాన్‌ నిలవలేక కేవలం 13 రోజుల్లోనే లొంగిపోయింది.

వివరాలు 

1971 యుద్ధంలో హంగోర్‌ పాత్ర

ఆ యుద్ధం తర్వాత బంగాళాఖాతంలో పాక్‌ నౌకాదళం మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత హంగోర్‌ జలాంతర్గాముల సాయంతో ఆ ప్రాంతంలో అడుగుపెట్టాలని పాకిస్థాన్‌ భావించడం వ్యూహాత్మకంగా ఆసక్తికర పరిణామంగా మారింది. భారత్‌ దీనిపై అప్రమత్తంగా నిఘా కొనసాగిస్తుండగా, దక్షిణాసియా సముద్ర భద్రతా సమీకరణాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement