LOADING...
PoK: పీవోకేలో ఉద్రిక్తత.. నిత్యావసరాల సరఫరాపై ఆంక్షలు
పీవోకేలో ఉద్రిక్తత.. నిత్యావసరాల సరఫరాపై ఆంక్షలు

PoK: పీవోకేలో ఉద్రిక్తత.. నిత్యావసరాల సరఫరాపై ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. నిరసనలను అణచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆహారం,మందులు,ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల సరఫరాలను అడ్డుకుంటోందని స్థానిక సంస్థలు,ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ పరిణామాలతో మరింత సంక్షోభంలోకి నెట్టబడ్డారని వారు చెబుతున్నారు. ఆందోళనకారుల కథనం ప్రకారం..పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీవోకేలోకి వెళ్లే ప్రధాన రహదారులపై భద్రతా తనిఖీల పేరుతో సరుకు రవాణా వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో గోధుమలు,పిండి,కూరగాయలు,వంటనూనె,పెట్రోల్,డీజిల్‌తో పాటు వైద్య అవసరాల కోసం ఉపయోగించే సామగ్రి సరఫరాపైనా తీవ్ర ప్రభావం పడిందని ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడగా,ఆసుపత్రులు కూడా అవసరమైన ఔషధాలను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

పెరుగుతున్న ప్రజల ఇబ్బందులు

ఇంధనం అందుబాటులో లేకపోవడంతో ప్రజా రవాణా, సరుకు రవాణా సేవలు కూడా దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. పీవోకేలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, జీవన వ్యయం పెరగడం, ప్రభుత్వంపై ఆధారపడే కుటుంబాల సంఖ్య అధికంగా ఉండటంతో తాజా పరిస్థితులు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్లలో నిత్యావసర వస్తువుల కొరత కారణంగా ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని సమాచారం.

వివరాలు 

పాక్ ప్రభుత్వ స్పందన

ఈ ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా తోసిపుచ్చింది. భద్రతా కారణాలతో కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు మాత్రమే పెంచామని, నిత్యావసరాల సరఫరాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ప్రజా ఉద్యమాలను బలహీనపర్చేందుకు ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఆందోళనలకు కారణాలివే..

గత కొంతకాలంగా పీవోకేలో విద్యుత్ చార్జీల పెంపు, అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి సమస్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్రాంతమే అయినప్పటికీ స్థానికులకు అధిక ధరలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారంటూ పెద్దఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, సమ్మెలు, బంద్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది జరిగిన నిరసనల అనంతరం కొన్ని డిమాండ్లను అమలు చేస్తామని పాక్ ప్రభుత్వం హామీ ఇచ్చినా, వాటి అమలులో పురోగతి కనిపించకపోవడంతో ప్రజలు మరోసారి ఆందోళన బాట పట్టారు.

Advertisement

వివరాలు 

భద్రతా బలగాల కఠిన చర్యలు

ఇటీవలి వారాల్లో పీవోకేలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలువురు ఉద్యమ నాయకులను అరెస్టు చేయడం, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను వ్యక్తం చేసే హక్కును అణచివేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుందని మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

అంతర్జాతీయంగా పెరుగుతున్న చర్చ

పీవోకేలో నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవైపు కశ్మీర్ అంశాన్ని ప్రపంచ వేదికలపై ప్రస్తావిస్తున్న పాకిస్తాన్,మరోవైపు తన ఆధీనంలోని ప్రాంతంలో ప్రజల అసంతృప్తిని ఎదుర్కొంటుండటం విశేషంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపడం కంటే కఠిన చర్యలకే ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి మరింత సంక్లిష్టమయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాల సరఫరాలో అంతరాయం కొనసాగితే పీవోకేలో మానవతా సంక్షోభం తలెత్తే ప్రమాదం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement