Smoking Violation: విమానంలోనే సిగరెట్ తాగాడు.. పాకిస్తాన్ హాకీ జట్టు మేనేజర్‌ను దింపేసిన సిబ్బంది
ఈ వార్తాకథనం ఏంటి
FIH ప్రో లీగ్ టోర్నమెంట్ కోసం సీనియర్ పాకిస్థాన్ హాకీ జట్టుతో మేనేజర్‌గా అర్జెంటీనాకు వెళ్లిన ప్రముఖ మాజీ ఒలింపియన్ అంజుమ్ సయీద్ బ్రెజిల్‌లో వివాదంలో చిక్కుకున్నారు. అర్జెంటీనా నుంచి పాకిస్తాన్‌కు తిరిగి వస్తున్న క్రమంలో విమానం రియో డి జనీరో విమానాశ్రయంలో ఇంధనం నింపేందుకు ఆగిన సమయంలో, ఆయన విమానంలోనే ధూమపానం చేసినట్లు గుర్తించారు. ఈ భద్రతా నిబంధన ఉల్లంఘనను విమాన సిబ్బంది తీవ్రంగా పరిగణించి, అంజుమ్ సయీద్‌తో పాటు మరో పాకిస్తాన్ ఆటగాడిని దుబాయ్‌కి వెళ్లే తదుపరి విమానంలో ఎక్కడానికి అనుమతించలేదు. దీంతో వారు బ్రెజిల్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. అంజుమ్ సయీద్ 1992 ఒలింపిక్స్ సెమీఫైనల్‌లో పాల్గొన్న అనుభవజ్ఞుడే.
Details
ఘటన అనంతరం స్వదేశానికి చేరిన అంజుమ్ సయీద్
1994 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టులో డిఫెండర్, మిడ్‌ఫీల్డర్‌గా కీలక పాత్ర పోషించారు. అలాంటి గొప్ప అనుభవజ్ఞుడిని ఈసారి జట్టు మేనేజర్‌గా నియమించడం గమనార్హంగా ఉంది. కానీ ఈ ఘటన అనంతరం, అంజుమ్ సయీద్ స్వదేశానికి చేరిన తర్వాత, జట్టుతో కలిసి రాలేకపోవడానికి దుబాయ్‌లోని కొంతమంది సిబ్బంది ప్రవర్తన కారణమని పేర్కొన్నారు. ఈ సంఘటన పాకిస్తాన్ క్రీడా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని భావించిన పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు అధికారులు స్పందిస్తూ, పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (PHF)ను ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ చేపట్టమని కోరారు.
Details
పాకిస్తాన్ హాకీపై ప్రతికూల ప్రభావం
విమానం ఇంధనం నింపుతున్న సమయంలో ధూమపానం అంశంపై ప్రశ్నించినప్పుడు, అంజుమ్ సయీద్‌తో పాటు మరో ఆటగాడు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ జట్టు తమ తొలి FIH ప్రో లీగ్ ప్రదర్శనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఇలాంటి వివాదాలు తలెత్తడం, పాకిస్తాన్ హాకీపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.