Loading...
Balochistan: బలూచిస్థాన్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సురబ్‌లో కర్ఫ్యూ, ఖుజ్దార్‌లో ఆంక్షలు
బలూచిస్థాన్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సురబ్‌లో కర్ఫ్యూ, ఖుజ్దార్‌లో ఆంక్షలు

Balochistan: బలూచిస్థాన్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సురబ్‌లో కర్ఫ్యూ, ఖుజ్దార్‌లో ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు సెంట్రల్ బలూచిస్థాన్‌లోని సురబ్ జిల్లాలో అధికారులు కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పలు ప్రాంతాల్లో అదనపు ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు సురబ్ జిల్లాలో కర్ఫ్యూ కొనసాగనుంది. ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి అనుమతి ఉండదు. భద్రతకు సంబంధించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా అందుకు సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వివరాలు 

ఖుజ్దార్ జిల్లాలోనూ కఠిన ఆంక్షలు

మరోవైపు సురబ్‌కు పొరుగున ఉన్న ఖుజ్దార్ జిల్లాలోనూ కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మార్కెట్లు, దుకాణాలు, హోటళ్లు సహా అన్ని వాణిజ్య సముదాయాలను మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. గత నెలలో సురబ్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల కూలీ సయీద్ అహ్మద్‌ను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఫ్రాంటియర్ కార్ప్స్ సిబ్బంది బలవంతంగా తీసుకెళ్లారని బలూచ్ మానవ హక్కుల సంఘాలు ఆరోపించాయి.

వివరాలు 

శాంతిభద్రతలను పరిరక్షించేందుకే కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు

మరో ఘటనలో ఆగస్టు 4న ఖుజ్దార్‌లో ఇనాయతుల్లా జట్టక్ అనే పౌరుడు దుండగుల కాల్పుల్లో హత్యకు గురయ్యారు.

స్థానిక డెత్ స్క్వాడ్ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన కుమార్తె బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని గంటలకే ఈ హత్య జరగడం గమనార్హం.

సురబ్‌లో యువకుడి అదృశ్యం, ఖుజ్దార్‌లో పౌరుడి హత్యతో పాటు వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే అధికారులు తాజా ఆంక్షలు విధించారని బలూచ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

అయితే శాంతిభద్రతలను పరిరక్షించేందుకే కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారుల ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT