Abraham Accords: ట్రంప్ 'అబ్రహం ఒప్పందం'కు పాకిస్థాన్ నో
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన 'అబ్రహం ఒప్పందం' ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలన్న ట్రంప్ విజ్ఞప్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపింది. ఇరాన్‌తో కుదరబోయే శాంతి ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్‌తో పాటు పాకిస్థాన్ కూడా అబ్రహం ఒప్పందంలో చేరాలని ట్రంప్ సామాజిక మాధ్యమం ద్వారా వ్యాఖ్యానించడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.
వివరాలు
మా దేశ విధానాలకు విరుద్ధం
ట్రంప్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు. దేశ ప్రాథమిక సిద్ధాంతాలు, జాతీయ విధానాలకు వ్యతిరేకంగా ఉండే ఏ ఒప్పందానికీ పాకిస్థాన్ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేసే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వ అధికారిక విధానం ప్రకారం ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించే ఉద్దేశమే లేదన్నారు.
వివరాలు
ఇరాన్ చర్చలకు దీనికి సంబంధం లేదు
ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదికలో చేసిన వ్యాఖ్యల్లో, ఇరాన్‌తో అమెరికా చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగం కావాలంటే ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. అయితే దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇరాన్‌తో జరుగుతున్న దౌత్య చర్చలకు, అబ్రహం ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాయి. బయటి ఒత్తిడులకు తలొగ్గే పరిస్థితిలో పాకిస్థాన్ లేదని స్పష్టం చేశాయి.
వివరాలు
సౌదీ అరేబియా కూడా వ్యతిరేకం
ట్రంప్ ప్రతిపాదనను సౌదీ అరేబియా కూడా తిరస్కరించింది. స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు స్పష్టమైన, శాశ్వత పరిష్కారం దొరికే వరకు ఇజ్రాయెల్‌తో సంబంధాల విస్తరణ సాధ్యం కాదని ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలపై ముస్లిం దేశాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో ట్రంప్ ఆశించిన విధంగా అబ్రహం ఒప్పందం విస్తరణకు అడ్డంకులు ఎదురయ్యాయి.
వివరాలు
అబ్రహం ఒప్పందం అంటే ఏమిటి?
ఇజ్రాయెల్,అరబ్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న విభేదాలను తగ్గించి, దౌత్య, ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారం పెంచేందుకు 2020లో ట్రంప్ ఆధ్వర్యంలో 'అబ్రహం ఒప్పందాలు' ప్రారంభమయ్యాయి. మొదట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అనంతరం మొరాకో, సూడాన్, కజకిస్థాన్ కూడా ఇందులో చేరాయి. పాలస్తీనా సమస్యను పక్కనబెట్టి ప్రాంతీయ భద్రత, వాణిజ్య సహకారంపై ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి సారిస్తోంది.